Breaking News Live: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
ఈశాన్య దిశ నుంచి తీరం వెంట తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం తీరం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో మూడు రోజులపాటు ఎలాంటి వర్ష సూచన లేదు. రాగల మూడు రోజులపాటు ఏపీలో అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు జరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం పొడిగా మారిపోయింది. అయితే ఒకట్రెండు చెట్ల మాత్రమే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. నేటి నుంచి నుంచి మూడు రోజులవరకు సీమలో వర్షాలు పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నిన్నటి వరకు ఓ మోస్తరు వర్షాలు కురవగా.. నేడు, మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా మారనుందని అధికారులు తెలిపారు. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో చలిగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ ఉన్నట్లుగానే నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్ ధర స్థిరంగా ఉండగా.. డీజిల్‌పై 0.25 పైసలు తగ్గింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా... డీజిల్ ధర రూ.94.14 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.110.51 అయింది. డీజిల్ ధర రూ.96.59గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.16 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.21 కి చేరింది. డీజిల్ ధర 0.15 పైసల పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.33 అయింది. చిత్తూరులోనూ ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.95 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.37 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ 28 పైసలు పెరగడంతో ధర లీటర్ ధర రూ.96.88 అయింది.
బంగారం ధర నేడు వరుసగా రెండోరోజు పెరిగింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. బంగారం ధర రూ.370 మేర పెరగగా, వెండి ధర రూ.900 మేర భారీగా పుంజుకుంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,700 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,850 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.800 మేర భారీగా పుంజుకోవడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,900గా ఉంది. ఇటీవల 65 వేల దిగువకు పడిపోయిన వెండి ధరలు పెరుగుతున్నాయి.
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధర రూ.400 మేర పెరగగా, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. విజయవాడలో పసిడి ధర రూ.400 మేర పెరగగా 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,850 అయింది.. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,700కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700 కు ఎగబాకింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20కు చేరాయి.
మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు
భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ మొత్తం 48 ఒమిక్రాన్ కేసుల నమోదయ్యాయి.
ఏపీలో మద్యం ధరలు తగ్గింపు
ఏపీలో మద్యం ధరలు తగ్గనున్నాయి. మద్యం పన్నుల్లో సర్కార్ మార్పులు చేయనుంది. వ్యాట్, ఎక్సైజ్ పన్నులలో మార్పులతో మద్యం ధరలు తగ్గనున్నాయి. నాటు సారాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రగతిభవన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం
ప్రగతిభవన్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ముగ్గురు పిల్లలతో పాటు దంపతులు .పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన వారిగా గుర్తించారు. భూ వివాదమే ఇందుకు కారణమని చెబుతున్నారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం... ఆరుగురు మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. బిచ్కుంద మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్ద లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.