Breaking News Live: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి, మృతుల్లో చిన్నారి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తమిళనాడు, యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Telangana Temperature Today: తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు. హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నేడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా నమోదుకానున్నాయి. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత తగ్గి ఎండల నుంచి ప్రజలకు ఊపశమనం కలగనుంది.
యానాంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (పాడేరు), అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలుంటాయి. విశాఖ నగరం పరిసర ప్రాంతాలైన అనకాపల్లి, పెందుర్తి, పరవాడలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం జిల్లా సాలూరు వైపుగా కొన్ని భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇవి నేరుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరు, అరకు వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపున నల్లమల అటవీ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
అనంతపురం జిల్లా అనంతపురం-కదిరి బెల్ట్ లో భారీ పిడుగులతో పాటుగా వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇవి మెళ్లగా కడప జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. సత్యసాయి (పుట్టపర్తి) జిల్లా, అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు, కడప జిల్లాలోని పలు భాగాల్లో ఈదురుగాలులు గంటకు 45 కి.మీ. దాకా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాత్రి నుంచి తెల్లవారిజామున దాక ఈ వర్షాలు ఓ మోస్తరు కురుస్తాయి. కడప నగరంతో పాటుగా ప్రొద్దట్టూరు, మైదుకూరులో భారీ వర్షాలతో పాటుగా పిడుగు సూచన ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేర్కొంది. చిత్తూరు జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. కుప్పం-వి.కోట పరిధిలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. అంతకుముందు మూడు రోల్లోనే ధర రూ.950 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.49,550 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.54,060 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.74,200 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,200 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.49,550 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.54,060గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,200 గా ఉంది.
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి, మృతుల్లో చిన్నారి
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం యానం-ఎదుర్లంక బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బైక్ ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారికి గాయాలు అవ్వగా, మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వారధిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఐ.పోలవరం, యానాం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
Karimnagar: కలకలం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ ఆడియో టేపు
కరీంనగర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. తన కొడుకుతో కలిసి చనిపోతానని ఆమె ఆ ఆడియో టేపులో ఆవేదన చెందారు. తన కేసును పరిష్కరించాలని మహిళా కానిస్టేబుల్ కోరారు. సీఎం కేసీఆర్, డీజీపీకి వినతి పత్రంతో పాటు ఓ ఆడియోను కూడా రిలీజ్ చేశారు. సిరిసిల్ల నుంచి ఇటీవల జగిత్యాలకు ఆమె బదిలీ అయ్యారు. 7వ బెటాలియన్ సిరిసిల్లలో ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆమె స్పోజ్‌కు దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు అవుతున్నా, ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆ కానిస్టేబుల్ విలపించారు.
Yadadri: యాదాద్రి జిల్లాలో పరువు హత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి.. అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ అనే యువకుడు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి పక్కా ప్లాన్‌తో హత్య చేయించాడు. రెండ్రోజుల క్రితమే రామకృష్ణను ట్రాప్ చేసి, మాయ మాటలు పెట్టి హైదరాబాద్‌కు పిలిపించారు. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృతదేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు. హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ గుప్త నిధుల కేసులో విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
చందానగర్‌లో మహిళా న్యాయవాది ఆత్మహత్య
హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివాని అనే యువ మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగా శివాని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈమెకు ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ లో భర్త అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.