Breaking News Live: పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జంగమేశ్వరపురం, నందిగామ, కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
నేడు కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తగ్గుముఖం పట్టనుంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జంగమేశ్వరపురంలో 15.2 డిగ్రీలు, కళింగపట్నంలో 15.8 డిగ్రీలు, నందిగామలో 16.3 డిగ్రీలు, బాపట్లలో 18.7, అమరావతిలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలు, కర్నూలులో 18.9 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే పొడిగా ఉండనుంది.
బంగారం వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు కూడా స్థిరంగా ఉంది. వెండి ధరలో కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.
పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సూర్యాపేటలో ఘోర ప్రమాదం-ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్ దగ్గర, డీజిల్ ఖాళీ ట్యాంకర్ ను గ్యాస్ వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీబీ సోదాల్లో పట్టుబడిన ఎస్సై, ఇద్దరు సిబ్బంది
గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు ,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు, డ్రైవర్ షఫీ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఖాసిం అనే వ్యక్తిని ఎస్సై, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
రివర్స్ పీఆర్సీ, ఉద్యోగుల అక్రమ అరెస్టులపై విశాఖలో నిరసన
విశాఖ: రివర్స్ పీఆర్సీతో పాటు ఉద్యోగుల గృహ నిర్భందాలు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా జగదాంబ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. CITU ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలను వంచించిందంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వారిని ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు CITU నేతలను అరెస్ట్ చేయడం తో విశాఖ జగదాంబ సెంటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది
యాదాద్రికి చేరుకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన యాదాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ 3 నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆపై ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.