Breaking News Live: ఫిబ్రవరి 15న కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
ఫిబ్రవరి 15న పోలీస్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 15వ తేదీ సీఎం కేసీఆర్  కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ను నిర్మిస్తోంది. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు

జాబ్ నోటిఫికేషన్స్ డిమాండ్.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడించిన యూత్ కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ MLA క్వార్టర్స్ ముట్టడి చేసింది. నిరుద్యోగ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు అని నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ తన కుటుంబానికి రాజకీయ నోటిఫికేషన్లు వేశారని, మరి నిరుద్యోగులకు ఎప్పుడు వేస్తారు అని ప్రశ్నించారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మాకు ప్రభుత్వం చేత నోటిఫికేషన్ వేయించడం కష్టం కాదు అని యూత్ కాంగ్రెస్ అంటోంది.

అనంతలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా సింగనమల మండలం శోధనపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా శోధనపల్లి క్రాస్ వద్ద ఆర్టిసి బస్సు మలుపు తిరుగుతుండడంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది.

గురుకుల‌ పాఠశాలలో కరోనా కలకలం.. మరో 8 మంది విద్యార్థులకు కరోనా

గుంటూరు జిల్లా చికలూరిపేటలోని రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నాలుగు రోజుల కిందట ఎనిమిది మంది విద్యార్థులకు పాజిటీవ్ రాగా వారిని ఇంటికి పంపించారు. ఆతర్వాత మరో 140 మంది విద్యార్థులకు జలుబు, జ్వరం లక్షణాలను గుర్తించారు. వారికి టెస్ట్ లు చేయగా మరో  ఎమిమంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది‌. ఇదే భవనంలో ఉన్న కొద్దిపాటి గదుల్లో మిగిలిన 230 మంది విద్యార్థులు కూడా తాము కరోనా బారిన పడతామనే  భయంతో ఆందోళన చెందుతున్నారు.

ఆత్మ హత్య చేసుకున్న మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న రేవంత్ రెడ్డి

టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 11 గంటలకు నెళ్ళికుడురు చేరుకుంటారు. 11:30 సంధ్య తండాలో ఆత్మ హత్య చేసుకున్న మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. డీసీసీ భరత్ చంద్రారెడ్డి ఇంట్లో టీ సేవిస్తారు. 12:30 గంటలకు బయ్యారంలో ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి బాసటగా నిలవనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు మారోని బాయికి నివాళి, బెల్లయ్య నాయక్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీకాంతి రెడ్డి తల్లి సరోజదేవికి నివాళి అర్పిస్తారు.

వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించననున్న రేవంత్ రెడ్డి

నేడు మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న మిర్చీ రైతుల కుటుంబాలను, 317 జీవో కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు పరామర్శించనున్నారు. నాగోబా జాతర సందర్భంగా వనదేవతలకు పూజలు సైతం నిర్వహిస్తారు.

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

అనంతపురం: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. దుకాణాలు,హోటళ్ళు మూసివేసి హిందూపురం పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

Background

దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు కానీ చలి గాలులు మాత్రం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోవాతావరణం పొడిగా మారడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో గత రెండు రోజుల మాదిరిగా వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి.  మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌‌లో రూ.350 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,250కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.1,400 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,300 అయింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.390 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.66,300కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు క్షీణించాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇదే ధరలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర కాస్త పెరిగింది. 22 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 అయింది. 

విజయవాడలో పెట్రోల్‌పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.61 కాగా, ఇక్కడ డీజిల్ పై 22 పైసలు తగ్గి లీటర్ ధర రూ.96.68 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 70 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.75 అయింది. డీజిల్ పై 65 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.83 కు చేరింది.

నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు దక్కించుకోలేని శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త అందించింది. నేటి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది. ఇందులో ఫిబ్రవరి 1వ తేది నుంచి 15 తేది వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెల కోటాలో రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తోంది టీటీడీ. కోవిడ్ తీవ్రత తగ్గితే తిరుపతిలో ఫిబ్రవరి 16 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ప్లాన్ చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి టీటీడీ రద్దు చేసింది.