పీతల కూర తింటే టైఫాయిడ్ పరార్- ఇదెక్కడి మందురా బాబు!
ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంత ప్రజలు టైఫాయిడ్ ను తగ్గించుకునేందుకు పీతల కూరను దివ్య ఔషధంగా వాడుతున్నారు. కర్రీ చేసో, కాల్చుకొనే తింటూ రోగాలను తగ్గించుకుంటున్నారు.
వర్షాకాలంలో వాతావరణ మార్పులు, కలుషిత నీటి వల్ల పలు రకాల సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే ఈ సీజనల్ వ్యాధులు తొందరగా తగ్గుతాయన్న నమ్మకంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ వాసులు ఈ వర్షాకాలంలో లభించే పీతలను కాల్చుకుని తినడంతో పాటు కూరలాగా వండుకొని తింటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఈ పీతలను తినే ట్రెండ్ అధికంగా కొనసాగుతోంది. అయితే ఈ పీతలను ఎలా, ఎక్కడ పడుతున్నారు, వాటిని మార్కెట్ లో ఎలా విక్రయిస్తున్నారు.. ప్రజలు ఈ పీతలను ఏవిధంగా వినియోగిస్తున్నారో ఓసారి చూసేద్దాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో వాతావరణ మార్పులు, తాగునీరులో వర్షపు నీరు కలుషితం కావడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధులు సోకడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది టైఫాయిడ్, మలేరియా తదితర రకాల జబ్బులతో బాధ పడుతున్నారు. అయితే కొంత మంది ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించి మాత్రలు మింగడం తదితర చికిత్స చేయించుకోగా... మరికొంత మంది మాత్రం ఆస్పత్రుల్లో తొందరగా తగ్గడం లేదంటూ ఆయుర్వేదపరంగా పూర్వ కాలం నుంచి పెద్దలు చెప్పిన విధానాన్ని పాటిస్తున్నారు.
ఇంతకీ ఏంటా ఆయుర్వేదం..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. వాగులు వంకలు, చెరువుల వద్ద ఈ వర్షాకాలంలో పీతలు అధికంగా లభిస్తుంటాయి. పీతలను ఇక్కడి ప్రాంతవాసులు ఎండ్రకాయలు అని అంటారు. ఎండ్రకాయలను వాగులు చెరువుల వద్ద పట్టుకుని మార్కెట్‌లో అధికంగా విక్రయిస్తున్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో బాధ పడుతున్న కొంత మంది టైఫాయిడ్ లేదా ఇతర జబ్బులు తొందరగా తగ్గుముఖం పడతాయన్న నమ్మకంతో ఈ పీతలను అధికంగా తింటున్నారు. వీటిని కాల్చుకు తినడం లేదా కర్రీలా చేసుకొని తినడం లేదా పీతలపై భాగం చిప్పలో ఉండే ద్రావణాన్ని మింగడం లాంటివి చేస్తున్నారు. వీటిని సేవించడం వల్ల టైఫాయిడ్ తదితర వ్యాధులు అతి త్వరగా తగ్గిపోతాయని విశ్వాసం ఇక్కడి ప్రజల్లో నెలకొంది. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా వీటిని అమ్ముతున్నారు.
పీతల అమ్మకంతో ఉపాధి పొందుతున్న గిరిజనులు..
కొంతమంది తమకు ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల వర్షా కాలంలో ఈ ఎండ్రకాయల అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పీతలకు మంచి గిరాకీ కూడా లభిస్తోంది. రోడ్లపై "టైఫాయిడ్ స్పెషల్" లాంటి బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం రూ.150 కి జోడి అమ్ముతున్నారు. కొంచెం పెద్దగా ఉండే పీతలను రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. సీజనల్ వ్యాధులు సోకిన వారు టైఫాయిడ్ తగ్గుతుందని వీటిని కొనుగోలు చేసి పీతల పైభాగంలో ఉండే చిప్పలు తీసి అందులో ఉండే ద్రావణాన్ని సేవిస్తున్నారు. మరి కొందరు వీటిని అగ్గిపై కాల్చుకు తినడంతోపాటు కూర వండుకొని తింటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పీతలను జుర్రేస్తున్నారు. వ్యాధులు నయం అవుతాయన్న నమ్మకంతో వీటిని పెద్దల కాలం నుండి పాటిస్తూ వస్తున్నట్లు చెబుతున్నారు.
పీతలు తినడం వల్ల చాలానే లాభాలు..!
పీతలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ఏజెన్సీ డీఎంహెచ్వో డాక్టర్ కుడిమెత మనోహర్ పీతల గురించి పలు విషయాలను వివరించారు. పీతలలో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయని అందరూ వీటిని తినడం సహజమని, వ్యాధులు నయం అవుతాయని ప్రజలు అనుకోవడం వారి నమ్మకమని, సైన్స్ పరంగా పరిశోధనలు చేస్తే తప్ప నిర్ధారణ చేయలేమని అంటున్నారు.