Khammam News: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య దూరం - ఆ చేయిని విడిచిపెట్టకూడదని..
Hand Casting: తన భార్య చనిపోయినా ఆమె చేతి స్పర్శ తనతో జీవితాంతం ఉండాలని ఆ భర్త భావించారు. విగతజీవిగా ఉన్న భార్య చేతిలో తన చేతిని, కూతురు చేయి వేసి హ్యాండ్ కాస్టింగ్ చేయించారు.
Husband Love His Deadly Wife In Khammam District: వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఓ కూతురు ఉంది. అయితే, అనారోగ్యంతో భార్య అకాల మరణం పొందగా ఆ భర్త కుంగిపోయాడు. భార్య రూపం తన మనసులో ఉన్నా ఆమె చేతి స్పర్శను ఎన్నటికీ వీడకూడదని అనుకున్నాడు. విగతజీవిగా మారిన ఆమె చేతిని తన కూతురు చేతులతో కలిపి అచ్చు వేయించారు. హ్యాండ్ క్యాస్టింగ్ చేయించి దాన్ని ఇంట్లో పెట్టుకుని తన భార్యపై అమితమైన ప్రేమను చాటుకున్నాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా (Khammam District) పెనుబల్లి మండలం యడ్లబంజర్‌కు చెందిన అశోక్ కన్నా అశ్వారావుపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. సత్తుపల్లిలో డిగ్రీ చదువుకునే సమయంలో చింతపల్లికి చెందిన పద్మశ్రీని ప్రేమించారు. ఇరువురూ పెద్దలను ఒప్పించి 2006లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి హర్షిత అనే ఇంటర్ చదివే అమ్మాయి ఉంది.
అనారోగ్యంతో భార్య మృతి
పద్మశ్రీకి నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఒకరోజు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో విజయవాడకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు జీబీ సిండ్రోమ్‌గా గుర్తించి చికిత్స అందించారు. వారం రోజుల క్రితం మళ్లీ అదే సమస్య రాగా.. విజయవాడలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం పద్మశ్రీ కన్నుమూశారు. అమితంగా ప్రేమించిన భార్య దూరం కావడంతో అశోక్ కన్నా కుంగిపోయారు. భార్య చేతి స్పర్శ తనతో కలకాలం ఉండాలని భావించి హ్యాండ్ కాస్టింగ్ చేసే వారిని పిలిపించారు. విగతజీవిగా ఉన్న పద్మశ్రీ, అశోక్, హర్షిత చేతులను కలిపి రసాయనం పోసిన బకెట్‌లో ముంచి ఒకే అచ్చుగా తీసుకెళ్లారు. వారి చేతులను హ్యాండ్ కాస్టింగ్ చేసి ఆ ముగ్గురి చేతుల రూపాన్ని తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. భార్యపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. భర్త ప్రేమను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు విధి వీరి బంధాన్ని దూరం చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.