Telangana Jobs: అంగన్‌వాడీల్లో 14,236 ఖాళీలు.. నోటిఫికేషన్ల జారీకి టెక్నికల్ ప్రాబ్లమ్స్
Telangana Anganwadi Jobs | తెలంగాణలోని అంగన్‌వాడీల పని బారం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టులు ఖాళీగా ఉండడంతో నిర్వహణ కష్టంగా మారింది.

14,236 Vacancies in Telangana Anganwadis: తెలంగాణలోని అంగన్‌వాడీల పరిస్థతి దారుణంగా మారింది. పోస్టుల ఖాళీల కారణంగా అంగన్వాడీలను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 20 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల టీచర్లు, హెల్పర్లు లేరు. దీంతో రోజువారీ నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. ప్రీప్రైమరీ విద్యాబోధన, పోషకాహారం అందించడం కూడా కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు, ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్ని నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేదు. ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రిటైర్మెంట్ ఇస్తూ వాటిని భర్తీ చేయని ప్రభుత్వం
అర్హులను ఉద్యోగ ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం.. వాటిని భర్తీ చేయించడంలో విఫలమవుతోంది. ఫలితంగా ఖాళీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమశాఖ ఆమోదించింది. వీటిల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ జారీకి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీల భర్తీ అంశంపై రెండు రోజుల క్రితం శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. వీలైనంత త్వరగా పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
7వేల మంది రిటైర్మెంట్.. వారి స్థానాలు కూడా ఖాళీ
65 ఏళ్లు నిండిన అంగన్వాడీలకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇస్తోంది. కానీ వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయడంలేదు. రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తోపాటు హెల్పర్ ఉండాల్సిందే. అయితే ఈ పోస్టులకు గతంలో కొందరు రిజైన్ చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. 65 ఏళ్లు నిండిన దాదాపు 7 వేల మంది టీచర్లు, హెల్పర్స్ ఉద్యోగ విరమణ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖాళీలు
గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి. ఈ రిజర్వేషన్ల జీవోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అంగన్వాడీల్లోకి ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే అక్కడి కేంద్రాల్లో స్థానిక ఆదివాసీలు, గిరిజనులను నియమించి వారితోనే ప్రీప్రైమరీ విద్యను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నియామకాలు చేపట్టేందుకు టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి.
భర్తీకి ఎలా ముందుకు వెళ్లాలి?
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇచేందుకు ఎలా ముందుకు వెళ్లాలని శిశు సంక్షేమశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యాబోధన కష్టమవుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత భాషలు తెలిసి ఉండాలనే నిబంధన చేర్చే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏవిధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని శిశు సంక్షేమశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలించి అందుకు అనుగుణంగా ఖాళీలు భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసే అవకాశం ఉంది.




















