WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు.
WhatsApp Proxy Servers: మనమందరం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటిలో వాట్సాప్ కూడా ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే వాట్సాప్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. వర్క్ అప్‌డేట్‌లు పొందాలన్నా, స్టాక్ మార్కెట్ కదలికలను తెలుసుకోవాలన్నా, డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా వాట్సాప్ ద్వారానే అన్నీ చేసుకోవచ్చు. విద్యారంగానికి సంబంధించిన ప్రభుత్వ పెద్ద సర్క్యులర్‌లు కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. వాట్సాప్‌లో పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని Meta ఎప్పటికప్పుడు అనేక అప్‌డేట్‌లను తెస్తుంది. ఇప్పుడు WhatsApp దాని యాప్‌లో ప్రాక్సీ
సపోర్ట్ ఫీచర్‌ను జోడించింది. దీని సహాయంతో వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా కూడా చాట్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి.
చాట్‌లు చాలా సురక్షితంగా ఉంటాయి
ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్ సహాయంతో WhatsApp వినియోగదారులు ఇంటర్నెట్ లేకపోయినా ఈ ప్లాట్‌ఫారమ్‌లో కనెక్ట్ అవుతారు. మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే కాదు మీ ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోయినా, మీరు వాట్సాప్‌ను ఉపయోగించగలరు. ఈ ఫీచర్ సహాయంతో WhatsApp వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, సంస్థల ప్రాక్సీ సర్వర్ సెటప్ ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. అంటే మీరు ప్రాక్సీ సర్వర్‌కు కనెక్ట్ చేయబడినప్పుడు మాత్రమే ఇంటర్నెట్ లేకుండా WhatsAppని ఉపయోగించగలరు.
వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతోపాటు ప్రాక్సీ ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించడం ద్వారా వ్యక్తుల గోప్యతకు ఎటువంటి భంగం ఉండదని, ఇది కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుందని కూడా చెప్పారు. ఇంటర్నెట్ లేదా వాట్సాప్‌పై కొన్ని దేశాల్లో నిషేధం ఉన్నందున ప్రజలు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుకోలేని దేశాల కోసం WhatsApp ప్రత్యేకంగా ఈ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసిందని అనుకోవచ్చు.
సరళమైన భాషలో చెప్పాలంటే మీరు ప్రాక్సీ సర్వర్ ద్వారా ఇంటర్నెట్‌ని ఉపయోగించినప్పుడు, మీ ఐడెంటిటీని ప్రాక్సీ సర్వర్ హైడ్ చేస్తుంది. ప్రాక్సీ సర్వర్ అనేది యూజర్, వెబ్‌సైట్ సర్వర్ మధ్య మాధ్యమంగా పనిచేస్తుంది.
ఇలా కొత్త ఫీచర్‌ని ఉపయోగించండి
ప్రాక్సీ ఫీచర్‌ని ఉపయోగించడానికి ముందుగా మీ WhatsApp సెట్టింగ్స్‌కు వెళ్లండి. మీరు WhatsApp తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు మీరు స్టోరేజ్, డేటా ఆప్షన్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు ప్రాక్సీ ఆప్షన్‌ను చూస్తారు. దాన్ని ఎంచుకున్న తర్వాత మీరు ప్రాక్సీ అడ్రస్‌ను నమోదు చేయాలి. మీరు WhatsAppని ఉపయోగించడానికి ఎనేబుల్ చేసే ప్రాక్సీ అడ్రస్ ఇది. విశ్వసనీయమైన, సురక్షితమైన ప్రాక్సీ అడ్రస్‌ను కనుగొనడానికి మీరు ఇంటర్నెట్ సహాయం తీసుకోవచ్చు.
View this post on Instagram