WhatsApp Status Update: వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్ స్టోరీగా పోస్ట్ చేయాలా? అది చాలా సింపుల్
వాట్సాప్ నుంచి సరికొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ స్టేటస్ ను నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది చాలామందికి తెలీదు.
సమాచార మార్పిడికి అందరూ వినియోగించే బెస్ట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు వాట్సాప్ వినియోగిస్తున్నారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ కొత్త అప్ డేట్లను అందిస్తూ ఉంటుంది. అందుకే, మీరు మీ ఫేస్ బుక్‌లోకి వెళ్లి స్టోరీలకు పోస్ట్ చేయడానికి బదులుగా వాట్సాప్ నుంచే స్టోరీని పోస్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే, మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ, కొందరు మాత్రం చాలా గందరగోళానికి గురవ్వుతుంటారు. వారి కోసమే ఈ కథనం.
వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా షేర్ చేసుకోవచ్చు
ఇప్పటికే ఎడిట్ మెసేజ్, ఆడియో చాట్స్, వ్యూ వన్స్ ఆడియో వంటి ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందులో తాజాగా మరో ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. వాట్సాప్ స్టేటస్ ను నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా షేర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ లో స్టేటస్ పెట్టగానే నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా కనిపించాలా అని అడుగుతుంది. మీరు పెట్టిన స్టేటస్ కిందనే Share to facebook Story అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు. మీ వాట్సాప్ స్టేటస్‌లో నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా పోస్టవుతుంది. ఇదివరకు ఈ ఫీచర్ ఫోటో-షేరింగ్ యాప్ Instagramలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు పోస్ట్ చేసిన స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేయవచ్చు. వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
త్వరలో వాట్సాప్ డిజైన్ మార్పు?
మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేయడానికి కృషి చేస్తోంది. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ ఇప్పుడు దాని యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులను తీసుకురావడానికి పని చేస్తోంది.
యూజర్ ఇంటర్ ఫేస్ లోకీలక మార్పులు
"కొంత కాలంగా వినియోగదారులు వాట్సాప్ ఇంటర్ ఫేస్ ను రీడిజైన్ చేయమని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుత ఇంటర్ ఫేస్ పాతది. ఆండ్రాయిడ్ ఇటీవలి అప్ డేట్స్ తర్వాత యూజర్ ఫ్రెండ్లీగా లేదని వారు భావిస్తున్నారు. వినియోగదారులు మరింత ఆధునికమైన, సహజమైన మార్పులను కూడా కోరుకుంటున్నారు. యాప్ ను నావిగేట్ చేయడానికి మార్గం, iOS యాప్ లాగానే చాట్స్, కాల్స్, కమ్యూనిటీలు, స్టేటస్ లాంటి ముఖ్యమైన ఫీచర్‌లను సులభంగా, వేగంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించేందుకు వాట్సాప్ కృషి చేస్తుంది" అని WABetaInfo తన పేజీలో వెల్లడించింది. "వాట్సాప్ వినియోగదారు అభ్యర్థనల ఫలితంగా, ఆండ్రాయిడ్ 2.23.8.4 అప్ డేట్ విడుదల చేసింది. దిగువ నావిగేషన్ బార్‌ను కలిగి ఉన్న యాప్ కోసం WhatsApp ఎట్టకేలకు సర్దుబాటు చేయబడిన ఇంటర్ ఫేస్ లో పని చేస్తోందని మేం గుర్తించాం" అని WABetaInfo తెలిపింది.
Read Also: టీనేజర్స్- రోజు 3 గంటలకుపై స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకు ఇబ్బందులు తప్పవు!