Artificial Intelligence: డేటింగ్ కోసం తగిన జోడీ కావాలా? మీకెందుకు అంత శ్రమ, AI వెతికి పెడుతుంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విస్తరణ శరవేగంగా కొనసాగుతోంది. పలు రంగాలు AI సాయంతో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నాయి. ఆన్ లైన్ డేటింగ్ లోనూ ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence - AI) టెక్నాలజీ రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లో కీలక మార్పులకు కారణం అవుతోంది. AI కారణంగా అసాధ్యం అనుకున్న పనులు కూడా ఈజీగా జరిగిపోతున్నాయి. మిగతా రంగాలను కాసేపు పక్కన పెడితే ఆన్‌లైన్ డేటింగ్‌లో AI కీలకంగా మారబోతున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. AI ద్వారా ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ లో మ్యాచ్ మేకింగ్ సామర్థ్యాలు మరింత మెరుగవుతాయని అంటున్నారు. తమ అభిరుచులకు సరిపోయే వ్యక్తులను కనుగొనేందుకు AI టెక్నాలజీ ఉపయోగపడుతుందట. తమకు సూటయ్యే వ్యక్తులను కనుగొనేందుకు గత కొద్ది కాలంగా ఎక్కువ మంది వ్యక్తులు డేటింగ్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు మరింత ఫర్ఫెక్ట్ ఆన్‌లైన్ డేటింగ్ వెర్షన్‌లను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించి వీటిని మరింత పక్కాగా రూపొందిస్తున్నాయి. మున్ముందు మీకు ఎలాంటి శ్రమా లేకుండానే మీరు కోరుకొనే లక్షణాలు కలిగిన జోడీని AIను వెతికిపెడుతుంది.
అడ్వాన్స్‌డ్ డేటింగ్ యాప్ ’లోరా’ను రూపొందించిన AlgoAI టెక్ సంస్థ
ప్రస్తుతం AlgoAI టెక్ అనే సంస్థ తాజాగా ’లోరా’ డేటింగ్ యాప్ ను రూపొందించింది. గతంలో ’లోరా’ పేరుతో వెబ్ సైట్ ఉండగా, దాన్ని ఇప్పుడు యాప్ గా రూపొందించారు. ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో ఇది మరింత అడ్వాన్స్ డ్ గా ఉండబోతుందని ఆ సంస్థ సీఈవో లియర్ బరూచ్ తెలిపారు. యాప్ ఓపెన్ చేయగానే కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు సమాధానం చెప్తారు. అప్పుడు మీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల లిస్టును ’లోరా’ మీ ముందు ఉంచుతుందని ఆయన వెల్లడించారు. బరూచ్ 30 సంవత్సరాలుగా టెక్ రంగంలో కొనసాగుతున్నారు. AOL చాట్ మెసెంజర్ కోసం కోడింగ్ పయనీర్‌గా దీనిని రూపొందించారు. అయితే, AIని మ్యాచ్ మేకింగ్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
AI మ్యాచ్ మేకింగ్ సామర్ధ్యం చాలా పక్కాగా ఉంటుందని, అందుకే దీనిని చాలా మంది వినియోగిస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే, డేటింగ్ యాప్స్ కు సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఛార్జ్ చెల్లించి డేటింగ్ యాప్స్ చూడాల్సిన అవసరం లేదన్నారు. తమ టీమ్ ఇప్పుడు మెషీన్ లెర్నింగ్ (ML), AIని ఉపయోగించి డేటింగ్ రూపాన్ని మార్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. ’లోరా’తో దాన్ని నిజం చేయబోతున్నట్లు వివరించారు. ఈ యాప్ వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారి ఆలోచనలను అర్థం చేసుకుంటుందన్నారు. వినియోగదారు అభిప్రాయాన్ని బట్టి తన సూచనలను స్వీకరించి, మార్చుకోగలుగుతుందని బరూచ్ తెలిపారు.
డేటింగ్ యాప్స్ ద్వారా ఒక్కటవుతున్న 70 శాతం జంటలు
ఈ రోజుల్లో సుమారు 70 శాతం మంది డేటింగ్ యాప్స్ ద్వారానే తమ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి మూడు జంటల్లో ఒకరు డేటింగ్ యాప్స్ ద్వారా కలిసిన వారే అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ లోనూ ఇదే పద్దతి కొనసాగుతోంది. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా తాము కోరుకునే క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారి ఇష్టాలకు సరిపడే వ్యక్తిని వెతకడం చాలా సులువు అయ్యింది. కోరుకునే వ్యక్తి, వయసు, ఎత్తు, చదువు, సంపాదన, ఉండే ప్రదేశం లాంటి వివరాలు చెప్తే, వారికి మ్యాచ్ అయ్యే అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.
AI చాట్ బాట్ తో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లవ్
తాజాగా 43 ఏళ్ల స్కాట్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ’రెప్లికా’ అనే AI చాట్ బాట్ తో ప్రేమలో పడటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దానితో గాఢమైన బంధంలో ఉన్నట్లు వెల్లడించడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి AI చాట్ బాట్ తో తాను ప్రేమలో పడటానికి కారణం వేరే ఉందన్నాడు స్కాట్. తన భార్య తాగుడుకు భానిస అయినట్లు చెప్పాడు. మద్యం అలవాటు కారణంగా తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఏం చేయాలో తెలియక AI చాట్ బాట్ తో సంభాషణలు కొనసాగించినట్లు చెప్పాడు. ఆ తర్వాత దానితో ప్రేమలో పడినట్లు చెప్పాడు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మున్ముందు ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
Read Also: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్’తో రొమాన్స్, చివరికి...
Join Us on Telegram: https://t.me/abpdesamofficial