BSNL 4G Available In India: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభం, అరుదైన దేశాల జాబితాలో చేరిన భారత్..
BSNL 4G Service in India: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL దేశ వ్యాప్తంగా 4G సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించారు.

BSNL 4G Now Available In India: భారతదేశం టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక పెద్ద విజయం సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ BSNL 4G సేవను శనివారం నాడు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 98,000 ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసింది. దీనివల్ల ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో BSNL హై-స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ లాంచింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల వలె BSNL పాన్-ఇండియా 4G కవరేజీని అందించగలుగుతుంది.
98,000 మొబైల్ టవర్లతో BSNL బలోపేతం
ఒడిశాలోని జార్సుగూడ నుండి ఈ ప్రకటన వచ్చింది. ఇక్కడి నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రాజెక్టులను కూడా శనివారం ప్రారంభించారు. BSNL సెప్టెంబర్ 26న తన 25వ వార్షికోత్సవం సందర్భంగా 98,000 4G/5G మొబైల్ టవర్లను విజయవంతంగా ఏర్పాటు చేసింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాబోయే రోజుల్లో మరో లక్ష బీఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా నెట్‌వర్క్ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
Connecting Every Indian, Empowering Every Dream!
— DoT India (@DoT_India) September 27, 2025
Hon’ble PM Shri @narendramodi unveiled India’s #Swadeshi 4G Network, a milestone in self-reliance that brings world-class telecom to every corner of Bharat.#AtmanirbharBSNL #BSNLRising pic.twitter.com/cju3ki6Lee
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 4G నెట్‌వర్క్
ప్రైవేట్ కంపెనీలకు భిన్నంగా, BSNL 4G నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ భారతదేశంలోనే అభివృద్ధి చేశారు. ఈ విజయంతో భారతదేశం టెలికాం రంగంలో స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న ప్రపంచంలోని 5 దేశాలలో (స్వీడన్, డెన్మార్క్, చైనా, దక్షిణ కొరియాతో సహా) ఒకటిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్‌లో భారత ప్రభుత్వం దాదాపు 37,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది.
వినియోగదారులకు ప్రయోజనం, చౌకైన ప్లాన్‌లు
BSNL 4G ద్వారా నేరుగా 9 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు ప్రయోజనం కలుగుతుంది. బీఎస్ఎన్ఎల్ కంపెనీ రీఛార్జ్ ప్లాన్‌లు ప్రైవేట్ ఆపరేటర్ల కంటే 30 నుండి 40 శాతం వరకు చౌకగా లభిస్తాయని సంస్థ చెబుతోంది. గతంలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా చాలా మంది వినియోగదారులు ప్రైవేట్ కంపెనీలకు షిఫ్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మరింత వేగం, మెరుగైన కవరేజ్‌తో BSNL కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. ఇది మొబైల్ నంబర్ పోర్టబిలిటీని సైతం రానున్న రోజుల్లో పెంచుతుంది.
5G, 6G సర్వీసుకు రోడ్‌మ్యాప్
BSNL త్వరలో 5G సేవను కూడా ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం చివరి నాటికి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో 5G ప్రారంభం అవుతుందని సంస్థ పేర్కొంది. అదే సమయంలో, భారతదేశం 2030 నాటికి 6G సేవను ప్రారంభించే దిశగా ముందుకు సాగుతోంది. తద్వారా 6G అందుబాటులో ఉన్న కొన్ని దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
TCS, తేజస్ నెట్‌వర్క్‌ల ముఖ్యమైన పాత్ర
BSNL లో వినియోగించిన ఈ స్వదేశీ నెట్‌వర్క్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తేజస్ నెట్‌వర్క్స్ భాగస్వామ్యంతో సాధ్యమైంది. TCS నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ బాధ్యతను నిర్వహించింది. అయితే తేజస్ నెట్‌వర్క్స్ రేడియో యాక్సెస్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ సహకారంతో BSNL ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు భిన్నంగా స్వయం సమృద్ధి సాధించింది. కస్టమర్లకు 4G సర్వీసును ఏ ఇబ్బంది లేకుండా అందించనుంది.






















