Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా సీ12.
Nokia C12 Pro: నోకియా సీ12 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
నోకియా సీ12 ప్రో ధర
ఇది ఒక లో కాస్ట్ స్మార్ట్ ఫోన్. మనదేశంలో ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. 2 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. లైట్ మింట్, చార్ కోల్, డార్క్ సియాన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. రెండు సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్‌ను కంపెనీ ఇవ్వనుంది. 12 నెలల పాటు రీప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా లభించనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. దీనికి సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఒకప్పుడు మొబైల్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన నోకియా ఎంత ఆధిపత్యం సాధించిందో తెలిసిందే. నోకియా 1100 ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మిలియన్ (25 కోట్లు) యూనిట్లు అమ్ముడయ్యాయి. నోకియా 1100 2003లో లాంచ్ అయింది. అత్యంత మన్నికైన మొబైల్‌గా మార్కెట్‌లో దీనికి చాలా మంచి పేరు ఉండేది. తక్కువ ధర, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ కారణంగా దాని డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగింది.
నోకియా 1100లో మోనోక్రోమ్ డిస్‌ప్లే ఉండేది. కాంపాక్ట్, తేలికైన డిజైన్‌తో క్యాండీ-బార్ స్టైల్‌లో దీన్ని రూపొందించారు. ఇది 96 x 65 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఉన్న చిన్న స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు కీ ప్యాడ్‌ని ఉపయోగించి ఫోన్ మెనుని నావిగేట్ చేయవచ్చు. ఫోన్‌లో ఫ్లాష్‌లైట్ ఉంది. దీని బ్యాటరీ ఏకంగా 400 గంటల స్టాండ్‌బై టైమ్, నాలుగు గంటల టాక్ టైమ్‌ని అందిస్తుంది.
నోకియా 1100 విజయవంతం కావడానికి ఒక కారణం కంపెనీ బేసిక్స్‌పై దృష్టి పెట్టడం. ఇది ఉపయోగించడానికి సులభమైన పరికరం. వినియోగదారులు కాల్‌లు చేయడానికి, SMS పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి, రిమైండర్‌లు, అలారంలను సెట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇందులో కాలిక్యులేటర్, స్టాప్‌వాచ్, క్యాలెండర్ వంటి అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇన్ని యూనిట్లు అమ్ముడు పోవడానికి మరో ఒక కారణం దాని ధర. నోకియా 1100 ధర చాలా రీజనబుల్‌గా ఉండేది.
నోకియా 1100 ప్రపంచవ్యాప్తంగా 2003లో లాంచ్ అయింది. కానీ భారతదేశంలో మాత్రం దీని లాంచ్ 2005లో జరిగింది. ఆ సమయంలో దీని ధర దాదాపు రూ. నాలుగు వేల నుంచి రూ. ఐదు వేల మధ్యలో ఉండేది. కాలక్రమేణా, నోకియా 1100 ధర మరింత తగ్గిపోయింది.