Netflix Account Sharing: వేరేవాళ్ల నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ వాడుతున్నారా- అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్‌పై కొత్త నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి.
ఎవరైనా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటే వాటిని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం సహజమే. కొంతమంది మిత్రులు తలా ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని వాటిని పంచుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం వీటిపై దృష్టి పెట్టింది. ఒకే ప్రదేశంలో లేకుండా వేర్వేరు ప్రదేశాల్లో ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉపయోగించేవారికి యాక్సెస్ బ్లాక్ చేసే ప్రయోగం చేస్తుంది.
‘ఈ నెట్‌ఫ్లిక్స్ ఖాతా యజమానితో మీరు కలిసి నివసించకపోతే... మీరు కచ్చితంగా కొత్త నెట్‌ఫ్లిక్స్ ఖాతాను ఉపయోగించాలి.’ అనే మెసేజ్ గతేడాది కొందరికి కనిపించింది. వేరేవారు ఖాతాలను ఉపయోగించకుండా ఉంచడానికి ఇది కేవలం ఒక రొటీన్ టెస్ట్ మాత్రమేనని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అయితే ఆ మెసేజ్ తర్వాత డిస్‌ప్లే అవ్వలేదు.
ఒకే ప్రదేశంలో లేకుండా ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉపయోగించే వారిని గుర్తించి యాక్సెస్ బ్లాక్ చేయడానికి అవసరమైన చర్యలను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటోంది. ఈ టెస్టు తర్వాతి కొద్ది వారాల్లో చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ప్రారంభం కానుంది. దీంతోపాటు వారికోసం బోల్ట్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకువస్తుంది. దీని ద్వారా ఒకే ప్రదేశంలో నివసించని వారు కూడా నెట్‌ఫ్లిక్స్ ఖాతాను పంచుకోవచ్చు.
‘ఒకే ప్రదేశంలో ఉండేవారికి నెట్‌ఫ్లిక్స్ వినియోగాన్ని సులభతరం చేయడానికి మేం ఎన్నో ఫీచర్లు తీసుకువచ్చాం. ఇందులో ప్రత్యేకమైన ప్రొఫైల్స్, మల్టీపుల్ స్ట్రీమ్స్ వంటి ప్లాన్లు ఉన్నాయి. వీటిలో స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఎలా ఉపయోగించాలనే దానిపై కూడా కొంచెం గందరగోళం నెలకొంది.’ అని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నొవేషన్ డైరెక్టర్ చెన్‌గ్యీ లాంగ్ తెలిపారు.
2021 నాలుగో త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 8.28 మిలియన్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లను పొందింది. 2022 మొదటి త్రైమాసికంలో 2.5 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లు రానున్నట్లు తెలిసింది. 2020 చివర్లో జరిగిన ఒక సర్వే ప్రకారం... మొత్తం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల్లో 33 శాతం మంది తమ పాస్‌వర్డ్‌లను బయటి వ్యక్తులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని నెట్‌ఫ్లిక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి సమయం పట్టేలా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?