iPhone 14 Max: ఐఫోన్ 14 మ్యాక్స్ ధర లీక్ - ఈసారి తక్కువగానే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ త్వరలో లాంచ్ చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ధర, ఫీచర్లు ఆన్‌లైన్లో లీకయ్యాయి.
ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల విషయంలో గత కొన్ని రోజుల నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి గురించి యాపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. ఇందులో ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ ధర (లీక్డ్)
ప్రముఖ టిప్‌స్టర్ శామ్ ఐఫోన్ 14 మ్యాక్స్ ధరను ట్విట్టర్ ద్వారా లీక్ చేశారు. దీని ప్రకారం ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 డాలర్లుగా (సుమారు రూ.69,600) ఉంది. అయితే ఇందులో ఉండే మిగతా వేరియంట్లకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో ధర 999 యూరోల (సుమారు రూ.77,300) నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 14 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనుంది.
యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
View this post on Instagram