Micromax In Note 2: మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం.. ధర రూ.13 వేలలోపే.. కేవలం 25 నిమిషాల్లోనే!
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇటీవలే మనదేశంలో ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ వారంలోనే లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ మొదటి సారి మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.13,490గా నిర్ణయించారు. బ్లాక్, బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.12,490కే కొనుగోలు చేయవచ్చు. సిటీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. 10 శాతం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనున్నాయి.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కంపాటిబుల్ చార్జర్‌తో చార్జ్ చేస్తే.. 25 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా.. బరువు 205 గ్రాములుగా ఉంది.