JioPhone Next: జియో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్.. రూ.5 వేలలోనే పవర్‌ఫుల్ ఫీచర్లు!
భారతదేశ నంబర్‌వన్ టెలికాం ఆపరేటర్ జియో తన మొదటి స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను త్వరలో లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
జియో ఫోన్ నెక్ట్స్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోన్ ఇటీవలే గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ వినాయక చవితికే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉండగా.. ప్రాసెసర్ల షార్టేజ్ కారణంగా వాయిదా పడింది.
జియోఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. అడ్రెనో 306 జీపీయూ కూడా ఇందులో ఉంది. 2 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది. ఇందులో హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించనున్నారు.
ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1440 పిక్సెల్స్‌గా ఉంది. 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
జియోఫోన్ నెక్స్ట్ రూపొందించడం కోసం జియో, గూగుల్ మొదటిసారి భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శక్తివంతమైన ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇందులో ఉండనున్నాయిని కంపెనీ అంటోంది. మంచి కెమెరా అనుభవాన్ని కూడా ఈ ఫోన్ అందించనున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ తాజా ఫీచర్లు, లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్లు ఎప్పటికప్పుడు అందించనున్నారు. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాలో ఇండియా సెంట్రిక్ ఫీచర్లు కూడా అందించనున్నారు.
తాజా కథనాల ప్రకారం.. ఇందులో బేసిక్, అడ్వాన్స్‌డ్ అనే రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటి ధర రూ.5,000 నుంచి రూ.7,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఆసక్తి గల వినియోగదారులు ఇందులో 10 శాతం కట్టి కొనుగోలు చేయవచ్చు. మిగతా మొత్తాన్ని ఫైనాన్స్ ద్వారా చెల్లించవచ్చు.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?