First Selfie: భారత్‌లో ఫస్ట్ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Selfie History: భారత్‌లో మొట్టమొదటి సెల్ఫీకి 145 ఏళ్లు నిండాయి. కెమెరా ప్రపంచానికి పరిచయం అవుతున్న రోజుల్లోనే త్రిపుర రాజ కుటుంబానికి చెందిన ఆలుమగలు 1880లో ఈ సెల్ఫీ దిగారు.
India’s First Selfie: భారత్‌లో మొట్టమొదటి సెల్ఫీ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన మహారాజ చంద్ర మాణిక్య ఆయన సతీమణి మహరాణి ఖుమన్ చాను మన్మోహిని దేవి తీసుకున్నారు. 1880లో ఈ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత మహారాజా వారే స్వయంగా దాన్ని పెయింటింగ్‌గా మలిచారు. అప్పటి నుంచి త్రిపుర సంస్కృతిని తెలిపే ప్రదర్శనల్లో ఆ పెయింటింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది.
అప్పట్లోనే సెల్ఫీ ఎలా దిగారు?
ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలకు ఎవరు వెళ్లినా అక్కడి నుంచి ఒక సెల్ఫీ ఫొటో లేదా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు. అంతెందుకు డైలీ లైఫ్‌లో ప్రతి అంశాన్ని సెల్ఫీ పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అంతగా సెల్ఫీ అన్న పదం ఆధునిక ప్రపంచభాషలో ఒక భాగమైంది. సెల్‌ఫోన్ యుగం వచ్చిన తర్వాత ఈ పదం ఉనికిలోకి వచ్చి అత్యంత సాదారణ వాడుక పదంగా మారింది. అదీ 21వ శతాబ్దంలో. మరి 19వ శతాబ్దంలోనే సెల్ఫీ దిగితే అది ఆశ్చర్యమే అవుతుంది. ఎందుకంటే ప్రపంచానికి కెమేరా పరిచయం అవుతున్న రోజులవి. ఆ రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర మహారాజ కుటుంబీకులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. 1880 లో త్రిపుర రాజకుటుంబానికి చెందిన మహారాజ చంద్ర మాణిక్య ఆయన సతీమణి మహరాణి ఖుమన్ చాను మన్మోహిని దేవి భారత్ నుంచి ఫస్ట్ సెల్ఫీ తీసుకున్న వాళ్లుగా రికార్డులకెక్కారు.
భారత్‌లో అతి తక్కువ కుటుంబాల దగ్గరే..
19వ శతాబ్దం చివరి అంకంలో భారత్‌లో త్రిపుర రాజవంశం, ఇండోర్ రాజవంశాల దగ్గర మాత్రమే కెమెరా ఉండేది. త్రిపుర రాజధాని ఆధునికీరణలో మహరాజా బిర్ చంద్ర మాణిక్యకు ప్రత్యేక పాత్ర ఉంది. అంతేకాదు ఆయనకు ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉంది. ఇండోర్ రాజు రాజా దీన్‌దయాల్, మహారాజ్ బిర్ చంద్ర దగ్గర మాత్రమే భారత్‌లో రెండు కెమెరాలు ఉండేవి అంటేనే త్రిపుర రాజుకు ఫొటోగ్రఫీపై ఎంత ఇంట్రెస్టో ఇట్టే అర్థం అవుతుంది. 1862 నుంచి 1896 వరకు ఈయన త్రిపురను పాలించారు. ఆ సమయంలో త్రిపుర పాలనాపరంగానూ, సామాజికపరంగానూ ఎంతో ఉన్నతంగా ఉండేది. ఆ సమయంలో 1880లో రాజదంపతులు ఈ సెల్ఫీ దిగినట్లు ఆ ఫోటోను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఫొటోలో మహారాణి చాను, మహారాజా భుజంపై వాలి ఉన్నారు. ఆయన్ని ప్రేమతో హత్తుకొని కనిపిస్తారు. మహారాజా ఎడమ చేతిలో నల్లటి లివర్ కనిపిస్తుంది. ఆ లివర్‌కు ఉన్న వైరు కెమెరాకు కనెక్టైంది. ఆ లివర్ సాయంతోనే ఆ రాజ దంపతులు సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ త్రిపుర సాంస్కృతిక చరిత్రలో ఓ మేలి తునకలా మిగిలిపోయింది. మనం త్రిపుర సాంస్కృతిక ప్రదర్శన శాలలు సందర్శిస్తే ఆ ఫొటో తప్పనిసరిగా అక్కడ పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది.
భారతదేశపు తొలి మహిళా ఫొటోగ్రాఫర్
త్రిపుర మహరాణి మన్మోహిని దేవి భారతదేశపు తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌గానూ ఆ రోజుల్లోనే రికార్డు సృష్టించారు. భర్త నుంచి ఫొటోగ్రఫీపై ఇష్టాన్ని పెంచుకున్న మన్మోహినీ దేవి, ఆయన శిక్షణలో రాయల్ ఫొటోగ్రాఫర్‌గా తర్ఫీదు తీసుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపునూ పొందారు. ఆ రాచజంట సంయుక్తంగా మొట్టమొదటి యాన్యువల్ ఫొటోగ్రఫిక్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. వాళ్లు నివసించిన మాధో నివాస్ మొత్తం ఫొటోగ్రఫీ పట్ల వారికున్న ఇంట్రెస్ట్‌ను చాటుతుంది. ఇప్పుడు రోజుకు లెక్కలేనన్ని సెల్ఫీలు దిగుతుండగా.. నాటి మొట్టమొదటి సెల్ఫీ ఆలుమగల అనుబంధంతో పాటు వారి ఆర్టిస్టిక్ స్పిరిట్‌కు, సృజనాత్మకతకు ఒక కొలమానంగా ఇప్పటికీ నిలుస్తోంది.
అయితే వాళ్లు సెల్ఫీ చరిత్రలో తమకంటూ తొలి పేజీ రాసి ఉంటుందని మాత్రం ఆ రోజుల్లో ఊహించి ఉండరు. ప్రపంచంలో ఐతే మొట్టమొదటి సెల్ఫీ 1839లోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబర్ట్ కార్నెలియస్ అనే వ్యక్తి డాగరోటైప్ కెమేరాతో ఆ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో ఫిలడెల్ఫియాలో ఈ సెల్ఫీ దిగాడు. భారత్‌కు ఈ కెమేరా 1839లోనే వచ్చినట్లు బాంబే టైమ్స్ వార్తను పబ్లిష్ చేసింది. కలకత్తాకు చెందిన థాకర్ అండ్ కంపెనీ వీటిని ఇంపోర్ట్ చేసుకొని దేశంలో ప్రచారం కల్పించి విక్రయాలు చేయడం మొదలు పెట్టింది. యూరోపియన్ టెక్నాలజీతో పాటు భారత్‌లో కూడా ఫొటోగ్రఫీ క్రమంగా ఊపందుకుంది. బ్రిటీషర్లు భారత్‌లోని ప్రతి సాంస్కృతిక పరమైన అంశాన్ని, ప్రజలను, అద్భుతమైన ప్రదేశాలను ఫొటోల ద్వారా భద్రపరచడం మొదలు పెట్టారు. భారత్‌లోని వైవిధ్యమైన సంస్కృతికి చిహ్నాలుగా నిలిచే కట్టడాలు ఇతర సుందరమైన దృశ్యాలను యూరఫ్ నుంచివ చ్చిన అమెచ్యుర్డ్ ఫొటోగ్రాఫర్ డాక్టర్ జాన్ ముర్రే తీశాడు. 1848 కాలంలో ఆగ్రాకు వచ్చిన అతడు మొఘల్ కట్టడాలను ఎన్నింటినో తీసి ఈ తరానికి వాటిని ఫొటోల రూపంలో అందిచండంలో ఎంతో కృషి చేశాడని చరిత్రకారులు చెబుతారు. ఇతడు తీసిన ఫొటోలు కూడా ఫారినర్స్ ఆ రోజుల్లో భారత్‌ను సందర్శించేందుకు ఒక కారణంగా నిలిచాయని అంటారు.