Tech Saves Nature: పూలు పూయిస్తున్న టెక్నాలజీ- శంకర్ సినిమా కాదు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్న నిజం
Tech Saves Nature: సాంకేతికత సాయంతో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్ వంటివి టెక్నాలజీతో సులభం చేయవచ్చని అంటున్నారు.
Tech Saves Nature: సాంకేతికత రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో వస్తున్న మార్పులు కొన్ని నమ్మశక్యంగా కూడా ఉండటం లేదు. టెక్నాలజీ పెరుగుదల మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో పెరిగిన డ్రోన్ల వినియోగం వల్ల చాలా పనులు చిటికెలో అయిపోతున్నాయి. సీసీటీవీ కెమెరాల వల్ల నేరగాళ్ల ఎంత సులభంగా పట్టుకుంటున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే టెక్నాలజీ సాయంతో ప్రకృతి రమణీయతను కాపాడవచ్చని అధికారులు చెబుతున్నారు.
రంగురంగుల పూలు చూస్తుంటే నిజంగా స్వర్గంలా కనిపిస్తుంది..
ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఎంత సుందర మనోహరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెంతనే హిమాలయ పర్వత శ్రేణులు లోయలో రంగు రంగుల పూలు నిజంగా స్వర్గంలా అనిపిస్తుంది. చాలా మంది ట్రెక్కర్లకు ఈ ప్రదేశం మొదటి గమ్యస్థానంగా ఉంటుంది. అందుకే దీనిని బిగనర్స్ ట్రెక్ అని కూడా పిలుస్తుంటారు. చమోలి జిల్లాలోని ఈ 87 చదరపు కిలోమీటర్లలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అలాగే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్‌లోని రెండు కోర్ జోన్‌లలో ఒకటి.
ఈ లోయలో ఆర్కిడ్ లు, గసగసాలు, ప్రైములస్, మ్యారిగోల్డ్, సాక్సి ఫ్రేజ్‌లు, సెడమ్స్, లిల్లీస్, డైసీలు లాంటి వివిధ రకాల 600 కంటే ఎక్కువ జాతి పుష్పాలు ఈ లోయలో ఉంటాయి. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ఈ ప్రదేశంలో పూలన్నీ వికసించి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే వీరి వల్లే ఆ అందం క్రమంగా కనుమరుగు అవుతోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పూలను తాకడం, కోయడం, పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ఈ ప్రకృతి రమణీయతపై ప్రభావం పడుతోంది. దీని వల్ల లోయలో పూల రకాలు క్షీణతకు గురి అవుతున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా పూల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని పూల పెరుగుదల వేగం గణనీయంగా పడిపోయింది.
సాంకేతిక సాయం..
ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడటంలో సాంకేతికత మంచి పాత్ర పోషిస్తుందని పర్యావరణ నిపుణులు, సాంకేతిక నిపుణులు అంటున్నారు. డ్రోన్ వినియోగం వల్ల ఫ్లవర్స్ వ్యాలీ స్థితి గురించి కచ్చితమైన అంచనాకు రావొచ్చని వాళ్లు చెబుతున్నారు. నిరంతర పర్యవేక్షణ, డిజిటల్ మ్యాపింగ్, భూ రికార్డుల మ్యాపింగ్ సహా వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడం వల్ల ప్రకృతి ఎలా ప్రభావితం అవుతుందో కచ్చితంగా తెలుసుకోవచ్చని వాళ్లు అంటున్నారు.
డ్రోన్ ల ద్వారా డేటా సేకరించి, ఏఐ ద్వారా దానిని ప్రాసెస్ చేసి తుది ఫలితాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఆర్థో మొజాయిక్ మ్యాపింగ్, హై ఎండ్ డ్రోన్ లతో హై రిజల్యూషన్ పిక్చరింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి వాటి వల్ల కచ్చితమైన అంచనాకు రావొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.