Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జింగ్ పోర్టు అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.
![Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! Common Charging Port For All Smartphones in India Government New Plan For E Waste Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/37bea347348012eaa3528edefcde26851660742824910252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇప్పుడు మనదేశంలో ఒక్కో రకమైన డివైస్‌కి ఒక్కో రకమైన చార్జర్ అందిస్తున్నారు. కేవలం మొబైల్స్ తీసుకుంటే అందులోనే మైక్రో యూఎస్‌బీ పోర్టు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, యాపిల్ ఫోన్లకు లైటెనింగ్ పోర్టు అందుబాటులో ఉన్నాయి. ఇక ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు సరేసరి. ల్యాప్‌టాప్‌లకు వేరే రకమైన చార్జర్లు అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా ఒక డివైస్ నుంచి మరో డివైస్‌కు మారేటప్పుడు పాత కేబుల్ వృథా అయిపోతుంది. దాని వల్ల ఈ-వేస్ట్ బాగా పెరుగుతోంది.
దీంతో ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఒకే చార్జర్‌తో పనిచేసే విధానం దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కామన్ చార్జర్ తీసుకురావడంలో సాధ్యాసాధ్యాలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి నిపుణుల బృందం ఏర్పాటుకు సిద్ధమైంది. ఒక్కో డివైజ్‌కు ఒక్కో రకం చార్జర్ కాకుండా, అన్నింటికీ ఒకే రకమైన చార్జర్ తీసుకొచ్చే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి మొబైల్స్, ల్యాప్‌టాప్ తయారీదారులు, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు, ఢిల్లీ ఐఐటీ, వారణాసి ఐఐటీ నిపుణులు హాజరయ్యారు.
అన్నింటికీ ఒకటే చార్జర్ కాకపోయినా.. తొలి దశలో రెండు రకాల చార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని సమావేశం అనంతరం రోహిత్ అన్నారు. ఇందులో సీ-టైప్ చార్జర్ కూడా ఒకటని తెలిపారు."ఇది చాలా సంక్లిష్టమైన అంశం. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అందరి(తయారీదారులు, యూజర్లు, పర్యావరణం) వాదనల్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. భాగస్వామ్య పక్షాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంది. వాటన్నింటినీ పరిశీలించేందుకు నిపుణులతో బృందం ఏర్పాటు చేస్తాం. మొబైల్స్, ఫీచర్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, వేరబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్... ఇలా రకరకాల విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలను ఏర్పాటు చేస్తాం. రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలను అందజేస్తాయి." అని రోహిత్ వివరించారు.
ఆ దేశాల్లో బంద్.. మరి ఇక్కడ ఎలా?
ఈ-వేస్ట్ వల్ల కలిగే దుష్పరిణామాల దృష్ట్యా.. అమెరికా, యూరోప్ ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లకు బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే చార్జింగ్ పోర్టు ఉండాలని తయారీ సంస్థలకు స్పష్టం చేశాయి. త్వరలోనే ఆ దిశగా కంపెనీలు మార్పులు చేసే అవకాశముంది.
అయితే భారత్‌లొ ఆ రూల్ లేదు కాబట్టి యాపిల్ వంటి సంస్థలు తాము ప్రత్యేకంగా రూపొందించిన లైట్‌నింగ్ పోర్ట్ చార్జర్లను మన దేశంలో ఎక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అంటే అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన ఈ-వేస్ట్ భారత్‌లో పోగుపడే ముప్పు ఉంది. దీని కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా కామన్ చార్జర్ విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)