Amazon TV: అమెజాన్ నుంచి టీవీ! అక్టోబర్‌లో లాంచ్.. అలెక్సాతో పనిచేసే టీవీలో ఫీచర్లు ఏంటో తెలుసా?
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి త్వరలో టీవీ రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ టీవీ అక్టోబర్ నెలలో అమెరికాలో విడుదల కానుందని బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది.
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి త్వరలో టీవీ రానుందని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ కంపెనీ స్వయంగా రూపొందించే ఈ టీవీ.. అక్టోబర్ నెలలో అమెరికాలో విడుదల కానుందని బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. ఈ టీవీ స్పెసిఫికేషన్ల గురించిన వివరాలతో కథనం రాసింది. అమెజాన్ డివైజెస్, ల్యాబ్ 126లకు చెందిన బృందాలు రెండేళ్ల నుంచి ఈ టీవీ డిజైన్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో రానున్న ఈ టీవీలను థర్డ్ పార్టీలు రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అమెజాన్ కంపెనీని సంప్రదించగా.. ఎలాంటి స్పందనా రాలేదని రీయూటర్స్ తెలిపింది.
అమెజాన్ టీవీ స్పెసిఫికేషన్లు (అంచనా)
గతేడాది అమెజాన్ నుంచి బేసిక్స్ టీవీ లాంచ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లోకి అమెజాన్ తమ సొంత బ్రాండ్ టీవీ తీసుకురానున్నట్లు వార్తలు రావడంతో.. ఈ కొత్త టీవీ స్పెసిఫికేషన్లు ఇవేనంటూ పలు లీకులు వస్తున్నాయి. అమెజాన్ టీవీ 55 నుంచి 75 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.
బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొన్న కథనం ప్రకారం.. అమెజాన్ నుంచి రానున్న ఫైర్ టీవీ అలెక్సా కమాండ్ కంట్రోల్ ఆధారంగా పనిచేయనుంది. ఇందులో అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్ ఉండనుంది. వ్యక్తుల మధ్య సంభాషణలు, డిష్‌వాషర్ శబ్దాల గురించి అలెక్సా స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీని రూపొందించే థర్డ్ పార్టీ కంపెనీలలో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ (TCL) టెక్నాలజీ కూడా ఉంది.
సొంత సాఫ్ట్‌వేర్ సంస్థ లేదు..
అమెజాన్ కంపెనీకి సొంతంగా సాఫ్ట్‌వేర్, ఇతర పరికరాలను రూపొందించే సంస్థ లేదు. ఇప్పటివరకు అమెజాన్ నుంచి విడుదలైన టీవీలలో వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఇచ్చే సాఫ్ట్‌వేర్, ఇతర పరికరాలను ఉపయోగించింది. గత కొన్నేళ్లుగా సొంతంగా సాఫ్ట్‌వేర్ ఆధారిత టీవీలను తయారు చేయాలని అమెజాన్ భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మొట్టమొదటి సారిగా అమెజాన్ బ్రాండ్ తో తయారైన టీవీలను మార్కెట్లోకి తీసుకొస్తుంది. వచ్చే నెలలో వీటిని అమెరికాలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఆ తర్వాతి నెలల్లోనే ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Amazon Jobs: అమెజాన్ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..