Chahal On Kohli: కోహ్లీ సెంచరీపై చాహల్ కామెంట్స్! ఏ కెప్టెనైనా ఒకటే!
Chahal On Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అండగా నిలిచాడు.
Chahal On Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అండగా నిలిచాడు. కొన్నేళ్లుగా అతడు భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడని పేర్కొన్నాడు. తన భాగస్వామ్యాలతో విజయాలు అందిస్తున్నప్పటికీ జనాలంతా సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు. అతడి వెనక 15-20 పరుగులుంటే బౌలింగ్ చేయడానికి ఏ బౌలరైనా భయపడతాడని వెల్లడించాడు.
'విరాట్ కోహ్లీకి టీ20ల్లో 50 పైగా సగటు ఉంది. రెండుసార్లు ప్రపంచకప్పుల్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో అతడి సగటు పరిశీలించండి. మనకు కనిపిస్తున్న సమస్య కేవలం సెంచరీ చేయకపోవడమే! అతడు చేసే విలువైన 60-70 పరుగుల గురించి మనం అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే అతడు నెలకొల్పిన ప్రమాణాలు అలాంటివి' అని యూజీ అన్నాడు. కింగ్ కోహ్లీ 15-20 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడంటే ప్రపంచంలోని ఏ బౌలరైనా అతడికి బంతులేసేందుకు భయపడతారని వెల్లడించాడు.
టీమ్‌ఇండియాను ఎవరు నడిపించినా జట్టులో తన పాత్ర మారదని యూజీ పేర్కొన్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్‌లో కెప్టెన్ ఎవరైనా తనను వికెట్లు తీసేందుకే ప్రోత్సహిస్తారని వెల్లడించాడు. 'కెప్టెన్ ఎవరైనా నా పాత్ర మారదు. వికెట్లు పడగొట్టే బౌలర్‌గానే నన్ను ఉపయోగించుకుంటారు. అందుకే నాకందరూ ఒక్కటే. బౌలర్‌గా నాకు స్వేచ్ఛ ఉంటుంది. నేనేం చేయాలనుకుంటానో దానికే ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు రోహిత్ భయ్యా పరిస్థితుల గురించి వివరిస్తాడు. ఇలాంటప్పుడు ఏం చేస్తావని అడుగుతాడు. అయితే బౌలర్లు ఏ ఓవర్లోనూ రిలాక్స్‌గా ఉండరు కదా' అని చాహల్ తెలిపాడు.
View this post on Instagram
View this post on Instagram