Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ సెటైర్లు!
Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
Wrestlers Protest:
హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. కేవలం ఒకే ఒక్క రెజ్లింగ్ కుటుంబం మాత్రమే జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అయినా.. న్యాయం కావాలంటే న్యాయస్థానానికి వెళ్లాలి కానీ జంతర్ మంతర్‌కు కాదని విమర్శించారు. ఇదంతా దీపిందర్ హుడా కోసం చేస్తున్నారని ఆరోపించారు.
తనపై లైంగిక ఆరోపణలు చేసిన అమ్మాయిలు ఒకే అఖాడాకు చెందినవారని బ్రిజ్‌భూషణ్ (Brij Bhushan Sharan Singh) అన్నారు. దానిని కాంగ్రెస్ నేత దీపిందర్ హుడా నడిపిస్తున్నారని చెప్పారు. '90 శాతానికి పైగా రెజ్లర్లు, సంరక్షకులు భారత రెజ్లింగ్ సమాఖ్యను విశ్వసిస్తున్నారు. ఒకే అఖాడాకు చెందిన కొన్ని కుటుంబాలు, అమ్మాయిలు నాపై లైంగిక ఆరోపణలు చేశారు. దానిని నడిపిస్తున్నది దీపిందర్ హుడా' అని ఆయన పేర్కొన్నారు.
'జంతర్ మంతర్ వద్ద మీకు న్యాయం దొరకదు. నిజంగా న్యాయం కావాలంటే మీరు పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్లాలి. ఇప్పటి వరకు వాళ్లు ఆ పని చేయలేదు. కోర్టు ఏం చెప్పినా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
ఆందోళన చేపట్టిన రెజ్లర్లకు రాజకీయ నాయకులు కొందరు మద్దతు తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, ప్రాంతీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు జంతర్ మంతర్‌కు వచ్చి మాట్లాడారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం రాలేదు. ఇదే విషయాన్ని బ్రిజ్ భూషణ్‌ను విలేకరులు ప్రశ్నించగా...
'అఖిలేశ్ యాదవ్‌కు నిజమేంటో తెలుసు. చిన్నప్పట్నుంచీ మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రెజ్లర్లు, వారి కుటుంబాలకు సమాజ్‌వాదీ పార్టీ ఐడియాలజీ తెలుసు. వారు నన్ను నేతాజీ అంటారు. వాళ్ల నేతాజీ ఎలాంటి వారో వాళ్లకు తెలుసు' అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వడంతో రెజ్లర్లు ఇక ఆందోళన వీడి ప్రాక్టీస్‌కు వెళ్లాలని మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అన్నారు. బ్రిజ్‌భూషణ్ ఆరోపణలపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీలో ఆయన ఒకరు. 'రెజర్లు మూడు నెలల క్రితమే ఈపని చేయాల్సింది. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇప్పటికైన ప్రాక్టీస్‌పై దృష్టి పెడితే మంచిది. దేశ ప్రధాన మంత్రికి సైతం శిక్షించే అధికారం లేదు. కోర్టులో ఆ పని చేస్తాయి' అని అన్నారు.
#WATCH | WFI chief Brij Bhushan Sharan Singh says, "90% of the athletes & guardians of Haryana trust the Wrestling Federation of India. A few families & the girls who have levelled allegations belonged to the same 'akhada'...The patron of that 'akhada' is Deepender Hooda."… pic.twitter.com/NqzrLvghqi
— ANI (@ANI) April 30, 2023