Australia: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా యునానిమస్ రికార్డు - వరుసగా ఏడోసారి!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది.
Women T20 WC 2023: ICC టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆధిపత్యం నిరంతరం కనిపిస్తూనే ఉంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా ఏడో సారి ఫైనల్‌కు చేరుకుంది. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా మహిళల జట్టు కప్ గెలుచుకుంది.
2009లో తొలి టీ20 ప్రపంచకప్ ఆడినప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత 2010 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో తొలిసారి ఫైనల్స్‌కు చేరుకుని ఆ తర్వాత కప్ గెలుచుకుంది.
దీని తర్వాత ఆస్ట్రేలియా జట్టు 2012, 2014 సంవత్సరాల్లో కూడా మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. 2016 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే వెస్టిండీస్ మహిళల జట్టు చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 2018, 2020ల్లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబర్చి కప్‌ను కైవసం చేసుకుంది.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ జట్టు ఫైనల్లో ఏ జట్టుతో తలపడుతుందనేది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత తేలిపోనుంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితం అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఘోరమైన ప్రారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (2: 5 బంతుల్లో), షెఫాలీ వర్మ (9: 6 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ రెండంకెల స్కోరు చేయడంలో విఫలం అయ్యారు. దీంతో భారత్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. విజయంపై ఆశలు కూడా పూర్తిగా చెదిరిపోయాయి.
కానీ ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (43: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) మళ్లీ విజయంపై ఆశలు చిగురింపజేశారు. ఎదురుదాడికి దిగి భారీ షాట్లు ఆడారు. కానీ వీరిద్దరూ అనుకోని విధంగా అవుట్ కావడం టీమిండియా కొంప ముంచింది. నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం డార్సీ బ్రౌన్ వేసిన బౌన్సర్ తలపై నుంచి చాలా ఎత్తుగా వెళ్తున్నప్పటికీ అప్పర్ కట్‌కు ప్రయత్నించిన జెమీమా వికెట్ కీపర్ హీలీకి క్యాచ్ ఇచ్చి అనుకోని రీతిలో వెనుదిరిగింది.
ఇక హర్మన్ ప్రీత్ వికెట్ అయితే పూర్తిగా దురదృష్టకరం. రెండో పరుగు తీస్తూ దాదాపు క్రీజులోకి చేరుకున్నాక బ్యాట్ గ్రౌండ్‌లో స్టక్ అయిపోవడంతో క్రీజులోకి చేరుకోలేక రనౌట్ అయింది. దీనిపై తన ఫ్రస్ట్రేషన్ మ్యాచ్ పూర్తయ్యాక కూడా కనిపించింది. నిజానికి భారత్ మ్యాచ్ ఓడిపోయింది ఇక్కడే. అనంతరం రిచా ఘోష్ (14: 17 బంతుల్లో, ఒక ఫోర్) కూడా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి లాంగాన్ దగ్గర్లో టహ్లియా మెక్‌గ్రాత్ చేతికి చిక్కింది.
ఆఖరి ఓవర్లో దీప్తి శర్మ పోరాడటానికి ప్రయత్నించినా అది పరుగుల తేడాను తగ్గించడానికే సరిపోయింది. భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా డార్సీ బ్రౌన్, యాష్లే గార్డ్‌నర్ రెండేసి వికెట్లు తీశారు. జెస్ జొనాసెన్, మేగాన్ షట్ తలో వికెట్ దక్కించుకున్నారు.