Sachin Tendulkar: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు - భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా?
టెస్టు క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-10 ప్లేయర్స్ వీరే!
Test Cricket: క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్‌గా టెస్టు క్రికెట్‌ను పరిగణిస్తారు. ఆటగాళ్ల సహనాన్ని, నైపుణ్యాలను పరీక్షిస్తుంది కాబట్టి టెస్టు క్రికెట్‌నే నిజమైన క్రికెట్ అని క్రికెట్ నిపుణులు, అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లు అవుతారన్నది కచ్చితంగా చెప్పవచ్చు. క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన టాప్-10 క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సచిన్ టెండూల్కర్
ఈ జాబితాలో భారత గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు అగ్రస్థానంలో ఉంది. తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో సచిన్ తప్ప మరే క్రికెటర్ కూడా ఇప్పటివరకు 200 టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. 200 టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్ 15,921 పరుగులు చేసి 46 వికెట్లు తీశాడు.
2. జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇప్పటివరకు మొత్తం 178 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. మరి సచిన్ రికార్డును బద్దలు కొడతాడో లేదో చూడాలి. అండర్సన్ ఇప్పటివరకు 678 వికెట్లు తీశాడు. తన కెరీర్‌లో 1,302 పరుగులు కూడా చేశాడు.
3. రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్‌లో 168 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రికీ పాంటింగ్ తన కెరీర్‌లో 13,378 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు కూడా తీశాడు.
4. స్టీవ్ వా
ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా తన కెరీర్‌లో 168 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతను తన కెరీర్‌లో 10,927 పరుగులు సాధించి, 92 వికెట్లు కూడా తీసుకున్నాడు.
5. జాక్ కలిస్
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్ కలిస్ పేరు ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో వస్తుంది. కలిస్ తన కెరీర్‌లో 166 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ కెరీర్‌లో 13,289 పరుగులు చేయడంతో పాటు 292 వికెట్లు కూడా తీశాడు.
6. శివ నారాయణ్ చందర్‌పాల్
వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ శివ్ నారాయణ్ చందర్‌పాల్ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ దిగ్గజ బ్యాటర్ తన కెరీర్‌లో 164 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 11,867 పరుగులు ఉన్నాయి. అప్పుడప్పుడూ బౌలింగ్ చేసి తొమ్మిది వికెట్లు కూడా తీశాడు.
7. రాహుల్ ద్రవిడ్
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 164 టెస్టు మ్యాచ్‌లతో ఈ లిస్ట్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో రాహుల్ ద్రవిడ్ 13,288 పరుగులు సాధించాడు. దీంతో పాటు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
8. అలిస్టర్ కుక్
ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ బ్యాటర్ అలిస్టర్ కుక్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అతను తన కెరీర్‌లో మొత్తంగా 161 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ 12,472 పరుగులు చేశాడు. అలాగే ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
9. స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరు కూడా ఈ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటికీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. బ్రాడ్ తన కెరీర్‌లో 567 వికెట్లు పడగొట్టాడు. అలాగే 3,558 పరుగులు చేశాడు.
10. అలన్ బోర్డర్
ఆస్ట్రేలియా మాజీ వెటరన్ అలన్ బోర్డర్ పేరు పదో స్థానంలో ఉంది. అలన్ తన కెరీర్‌లో మొత్తంగా 156 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో అలన్ బోర్డర్ 11,174 పరుగులు చేశాడు. దీంతో పాటు 39 వికెట్లు కూడా తీసుకున్నాడు.