Tokyo Olympics Opening Ceremony: విశ్వ క్రీడా సంబరం ఈ రోజే స్టార్ట్... ప్రత్యేకతలివే
బజపాన్‌లోని టోక్యో వేదికగా విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌కి ఈ రోజే తెరలేవనుంది. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు వచ్చారు.
జపాన్‌లోని టోక్యో వేదికగా విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌కి ఈ రోజే తెరలేవనుంది. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు వచ్చారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యోకి వెళ్లారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి రోజువారి భత్యం కింద రూ.3,723 ఇవ్వనున్నారు.
ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇప్పటి వరకూ షూటర్ అభినవ్ బింద్రా మాత్రమే వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలుపొందాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత మరే భారత అథ్లెట్ కూడా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలవలేకపోయారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు.. పసిడి గెలిచేలా కనిపించింది. కానీ.. రజతంతో సరిపెట్టుకుంది. అయితే.. హాకీ జట్టు మాత్రం ఇప్పటికే ఒలింపిక్స్‌లో ఏకంగా 8 పసిడి పతకాలను గెలిచింది.
టోక్యో ఒలింపిక్స్ ఆరంభోత్సవం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకి స్టార్ట్ కానుంది. పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేవలం 1000 మంది అతిథుల సమక్షంలో ఈ ఆరంభోత్సవం జరగనుండగా.. భారత్ నుంచి అథ్లెట్ల కవాతులో కేవలం 20 మంది క్రీడాకారులు, ఆరుగురు ప్రతినిధులు మాత్రమే పాల్గొనున్నారు. ఫెన్సింగ్‌లో భవానీ దేవి పోటీ పడుతుండగా.. భారత్ నుంచి ఫెన్సింగ్‌లో ఓ క్రీడాకారిణి పోటీపడటం ఇదే మొదటిసారి. అలానే సెయిలింగ్‌లోనూ భారత్ జట్టు తొలిసారి పోటీపడుతోంది.
జపాన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 1964లో ఆసియాలోనే తొలిసారిగా టోక్యోలో విశ్వ క్రీడలు జరిగాయి. ఆధునిక శకంలో జరుగనున్న 32 ఒలింపిక్స్ ఇవి. 1896లో ఏథెన్స్‌లో తొలిసారి విశ్వ క్రీడలను నిర్వహించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా 1916, 1940, 1944 ఒలింపిక్స్ రద్దయ్యాయి. చరిత్రలో క్రీడలు వాయిదా పడడం మాత్రం ఇదే తొలిసారి.
ఒలింపిక్స్‌లో తొలి పతకం దక్కేది రేపే. శుక్రవారం వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరిగినప్పటికీ పతక పోరుకు శనివారమే తెరలేవనుంది. తొలి రోజు ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్, రోయింగ్, షూటింగ్‌లో అథ్లెట్లు తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటల నుంచి పోటీలు ఆరంభమవుతాయి.