Tokyo Olympics Women's Hockey: చెదిరిన కల... కాంస్య పోరులో మహిళల హాకీ జట్టు ఓటమి...గ్రేట్ బ్రిటన్ విజయం
కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పోరులో ఓడిపోయింది. ఎలాగైనా పతకం సాధించాలన్న కసితో గ్రేట్ బ్రిటన్‌తో కాంస్య పోరుకు సిద్ధమైంది. శాయశక్తులా పతకం కోసం చివరి నిమిషం వరకూ పోరాడి ఓడింది.
కాంస్య పతక పోరులో భారత మహిళల జట్టు శుక్రవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారైంది. దీంతో టీమిండియా పతకం చేజారింది. ఓటమిని జీర్ణించుకోలేని భారత క్రీడాకారిణులు మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యారు.
కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన తొలి 10 నిమిషాల్లోనే బ్రిటన్ రెండు గోల్స్ చేసి గట్టి పోటీ ఇచ్చింది. వెంటనే పుంజుకున్న భారత జట్టు పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి రెండో క్వార్టర్లో కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి తన సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు.
ఇక మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమజ్జీవులుగా నిలిచాయి. దీంతో మ్యాచ్ చూసే వారిలో నరాలు తెగే ఉత్కంఠ. నాలుగో క్వార్టర్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. చివరి 15 నిమిషాల ఆటలో బ్రిటన్ తొలి గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో మహిళల హాకీ చరిత్రలో తొలి ఒలింపిక్ పతకం చేరాలని ఆశించిన భారత్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇరు జట్లు దూకుడుగా ఆడినప్పటికీ... డిఫెన్స్‌లో మనవాళ్లు బ్రిటన్ కంటే కాస్త మెరుగ్గా ఆడితే ఫలితం వేరేలా ఉండేదేమో అనుకున్నారు అంతా. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి సేనకు యావత్ భారత్ మద్దతుగా నిలిచింది. సుమారు 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు కాంస్య పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలనుకుంది. ఇంతకుముందు ఎన్నడూ చేయని ప్రదర్శనతో మహిళల జట్టు ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో మహిళల జట్టుది ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గురువారం జర్మనీని ఓడించి కాంస్యం సాధించిన భారత పురుషుల జట్టు ప్రేరణతో కంచు నెగ్గాలని మహిళల జట్టు తహతహలాడింది. సెమీస్‌లో 1-2తో అర్జెంటీనా చేతిలో ఓడినా.. స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో భారత జట్టు ఆకట్టుకుంది. విజయం కోసం అర్జెంటీనాను చెమటోడ్చేలా చేసింది. కానీ కీలక సమయాల్లో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌లు సమర్పించుకుని నష్టపోయింది. గ్రూపు దశలో 1-4 తేడాతో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిన భారత్ మళ్లీ కాంస్య పోరులో అదే జట్టు చేతిలో ఓడి కాంస్య పతకానికి దూరమైంది.