Mary Kom: ఒట్టేసి చెబుతున్నా.. నేను ఓడిపోలేదు.. నా దృష్టిలో మేరీ కోమ్ క్లియర్ విన్నర్... పాయింట్ల నిర్ణయంపై ఏం జరిగిందంటే!
జడ్జీల తీరుపై భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. నా దృష్టిలో మేరీ కోమ్ క్లియర్ విన్నర్ అని ట్వీట్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో స్వదేశానికి సగర్వంగా తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ రౌండ్-16లో ఓటమిపాలైంది. 48-52 కేజీల మహిళల ఫ్లై వెయిట్ విభాగంలో వాలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనాతో శక్తి వంచన లేకుండా పోరాడినా ఓటమి చెందడంతో ఒలింపిక్స్ నుంచి మేరీ కోమ్ నిష్క్రమించింది.
ఇవే ఆఖరి ఒలింపిక్స్‌గా భావిస్తున్న మేరీకోమ్ ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓడిపోయింది. దీంతో మేరీ కోమ్ ఆశ్చర్యానికి లోనై కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలన్న తన చిరకాల స్వప్నాన్ని ఎలాగైనా సాకారం చేసుకుందామని భావించిన మేరీకోమ్ కల కలగానే మిగిలిపోయింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో మేరీకోమ్ ఫొటోలను షేర్ చేస్తూ ‘నీ పోరు అద్భుతం... మ్యాచ్ గెలవకపోయినా... నువ్వు మా మనసులు గెలిచావు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేశారు.
ఐదుగురు జడ్జీలు ప్రత్యర్థికి 49 పాయింట్లు ఇవ్వగా మేరీకోమ్‌కు 46 మాత్రమే కేటాయించారు. ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి సైతం అదే రీతిలో చెలరేగడంతో న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సమానంగా స్కోర్ ఇచ్చారు. తొలిరౌండ్లో ఆధిక్యంతో వాలెన్షియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ పాయింట్ల ఇవ్వడంలో జడ్జీల తీరుపై బాక్సర్ మేరీ కోమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది. జడ్జీల నిర్ణయం నాకు అర్థం కాలేదు. ఐఓసీ ఏం చేస్తోంది? టాస్క్‌ఫోర్స్‌లో నేనూ సభ్యురాలిగా ఉన్నా. నిష్పాక్షికంగా పోటీలు నిర్వహించాలంటూ సలహాలూ ఇచ్చా. మరి నాకెందుకు ఇలా చేశారు? రింగ్‌లో ఉన్నప్పుడు.. బౌట్ ముగిశాక కూడా నేను గెలిచాననే అనుకున్నా. డోపింగ్ పరీక్షలకు తీసుకెళ్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నా. కోచ్ చెప్పడంతో నేను ఓడిపోయినట్లు తెలిసింది. నా ప్రత్యర్థిని గతంలో రెండు సార్లు ఓడించా. ఆమెని విజేతగా ప్రకటించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఒట్టేసి చెబుతున్నా నేను ఓడిపోలేదు’ అని మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Mary Kom didn't realised she won. @Sportskeeda #Tokyo2020 #Boxing pic.twitter.com/px1cQCLALC
— Abhijit Deshmukh (@iabhijitdesh) July 29, 2021
ఇదే విషయంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. ‘నా దృష్టిలో మేరీ కోమ్ క్లియర్ విన్నర్. కానీ, జడ్జీలకు వారి కాలిక్యులేషన్లు ఉంటాయి’ అని అన్నారు. అదేవిధంగా ట్విటర్లో స్పందిస్తూ... ‘డియర్ మేరీకోమ్ నువ్వు టోక్యో ఒలింపిక్స్‌లో ఒక పాయింట్‌తో ఓడిపోయావు. కానీ, నా వరకు నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌వే. ప్రపంచంలో ఏ మహిళా బాక్సర్ సాధించలేని ఘనతలు నువ్వు సాధించావు. నువ్వు లెజెండ్. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది. బాక్సింగ్, ఒలింపిక్స్ నిన్ను మిస్సవుతాయి’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
వాలెన్షియాతో తలపడటం మేరీకోమ్‌కి ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరిద్దరూ 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో తలపడ్డారు. అప్పుడు వాలెన్షియాను భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తన పంచ్‌లతో ఓడించింది. కానీ, ఇప్పుడు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో జడ్జీలు ఇచ్చిన పాయింట్ల కారణంగా అదే ప్రత్యర్థి చేతిలోనే మేరీ కోమ్ ఓటమి చెందాల్సి వచ్చింది. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా వాలెన్షియా నిలిచింది.