Tamil Nadu: ఒలింపిక్స్ నుంచి వచ్చాక ఘనస్వాగతం.. కానీ ధైర్యం చెప్పి పంపిన అక్క ఎక్కడ.. కన్నీళ్లు పెట్టించే అథ్లెట్ కథ ఇది
ఒలంపిక్స్ ముగించుకుని సొంత రాష్ట్రానికి చేరుకుంది ఆ అథ్లెట్. గెలవకపోయినా.. తాను పడిన కష్టం చూసిన జనమంతా ఘన స్వాగతం పలికారు. కానీ ఒక్క విషయం తెలిసి రోడ్డుపైనే కూప్పకూలిపోయింది.
టోక్యో ఒలంపిక్స్ లో అద్భుతమైన పోరాటం చేసి.. తమిళనాడుకు వచ్చింది ధనలక్ష్మి. ఒలింపిక్స్‌లో 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పాల్గొన్న ధనలక్ష్మి అద్భుత ప్రదర్శన చేసింది. కానీ పతకం సాధించలేకపోయింది. అయితేనేం.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఆమె ప్రదర్శన చూసిన జనమంతా ఆమెకు.. ఫ్యాన్ అయిపోయారు. ఒలంపిక్స్ ముగియడంతో సోంతరాష్ట్రం తమిళనాడుకు వచ్చింది. తిరుచ్చి విమానాశ్రయంలో దిగింది. కష్టపడి వచ్చిన.. తమ రాష్ట్ర బిడ్డకు అందరూ ఘనంగా స్వాగతం పలికారు. కానీ ఆమె కళ్లు ఎక్కడో వెతుకుతున్నాయి. దేనికోసమో ఆరాడ పడుతున్నాయి.
గెలుస్తావనే నమ్మకం.. ఇచ్చి గుండెల నిండ ధైర్యం నింపిన అక్క గాయత్రి కనిపించడం లేదు. తాను పోరాడిన దానికి లభించిన స్వాగతం చూసి ఆనందపడిపోయింది ధనలక్ష్మి. కానీ అక్క కనిపించడం లేదనే ఆలోచన ఇవేమీ పట్టకుండా చేస్తున్నాయి. తన బంధువు వచ్చి.. చెవిలో ఓ మాట చెప్పారు. దీంతో ధనలక్ష్మి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఎయిర్ పోర్టు ముందే ఆమె రోడ్డుపై కూర్చొని బోరున ఏడ్చింది. దానికి కారణం.. ధనలక్ష్మి అక్క మరణం. తన ఏడుపు చూసి పక్కన ఉన్న వాళ్లు గుండెల్లో తడి. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి అందరిది.
నిజానికి ధనలక్ష్మి పాటియాలాలో ప్రాక్టిస్ చేస్తున్నప్పుడే తన అక్క గాయత్రి చనిపోయింది. ఈ విషయం చెబితే.. తన ప్రాక్టిస్ ఎక్కడ దెబ్బతింటుందోనని ఎవరూ చెప్పలేదు. గాయత్రి ఆగష్టు 12న మరణించింది. ఆగష్టు 23న ధనలక్ష్మి టోక్యోకు వెళ్లింది. ఈ విషయం చెబితే.. తన బిడ్డ భవిష్యత్ ఏమవుతుందో.. ఇంత గొప్ప అవకాశాన్ని పాడుచేసుకోవడం ఎందుకని.. ధనలక్ష్మి తల్లి ఈ విషయాన్ని దాచేసింది.
ధనలక్ష్మికి 15 ఏళ్లు ఉన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయారు. అయినా తల్లి ఎంతో కష్టపడి పెంచింది. బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా చేయాలని కలలు కన్నది. ఎన్ని సమస్యలున్నా.. బిడ్డను ప్రాక్టిస్ కు పంపేది. అయితే సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్లలో క్వీన్ ఆఫ్ ట్రాక్ గా పేరున్న ద్యుతి చంద్ పై గెలిచిన తర్వాత.. ధనలక్ష్మి పేరు మారుమోగింది.
అంతేకాదు... జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మార్చి 18న పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచింది. 1998లో ఇదే మీట్‌లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది.
మార్చి 2021 లో జరిగిన ఫెడరేషన్ కప్ ఫైనల్స్‌లో ద్యుతి చంద్, హిమా దాస్ వంటి వారిని అధిగమించి ధనలక్ష్మి శేఖర్ ప్రముఖ స్ప్రింటర్‌గా ఎదిగింది. ధనలక్ష్మి తల్లి పలు ఇండ్లలో పనిచేస్తూ.. ధనలక్ష్మితోపాటు ఆమె ఇద్దరి తోబుట్టువులకు చదువు చెప్పించింది. తన కోచ్ సూచన మేరకు స్ప్రింటర్‌గా మారడానికి ముందు, ధనలక్ష్మి ఖో-ఖో ప్లేయర్‌గా సత్తా చాటేది.
అయితే, టోక్యో ఒలంపిక్స్ లో 4x400m రిలే జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఓడిపోయింది. వచ్చే ఒలంపిక్స్ లో గెలిచి తీరతామనే.. పట్టుదలతో ఉంది. ధనలక్ష్మి చేసిన అద్భుత ప్రదర్శనను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు.
తన కష్టాన్ని గుర్తించారని అనుకున్న ధనలక్ష్మికి అక్క గాయత్రి మరణ వార్త విషాదంలోకి నెట్టింది. తనకు ఎంతో ధైర్యాన్ని చెప్పి పంపిన అక్క లేదనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోతోంది.
గాయత్రి మరణం గురించి నేను ధనలక్ష్మికి చెప్పలేదు, ఆమె బాధపడటం, ఆమె పడిన కష్టం వృథాగా పోవడం ఇష్టం లేదు. నా పెద్ద కూతురు లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ధనలక్ష్మి ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఆమె ఐదేళ్ల కృషి ఫలించింది. వచ్చే పోటీల్లో ధనలక్ష్మి మరింత కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని నమ్మకం ఉంది. కానీ గాయత్రి.. ఆ గెలుపును చూడలేదు.. అని ఏబీపీతో ధనలక్ష్మి తల్లి ఉష చెప్పింది.