Chess Ban: చెస్‌పై నిషేధం.. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల నయా హుకుం - ఆటపై ఎందుకంత కోపం
Chess Ban: చెస్‌పై బ్యాన్ విధించారు తాలిబాన్లు. చెస్ ఆడితే దైవ ప్రార్థన చేయరని భావించి తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తాత్కాలిక నిషేధం అని చెబుతున్నా దానిపై స్పష్టత లేదు.

Ban on Chess in Afghanistan: తాలిబన్ ప్రభుత్వం ఆఫ్గానిస్థాన్‌లో మరొక విచిత్రమైన నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అదే చదరంగంపై బ్యాన్. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని హుకుం జారీ చేసిన తాలిబన్లు లేడీ అథ్లెట్ లు వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి కారణం అయ్యారు. గత పారిస్ ఒలింపిక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను రిప్రజెంట్ చేసిన ముగ్గురు మహిళలు వేరే వేరే దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మహిళల క్రికెట్ టీం కూడా ఆస్ట్రేలియా లాంటి వేరే దేశాల నుంచి తమ దేశానికి ప్రాతినిధ్యం. వహిస్తున్నారు. ఇలా క్రీడల్లో మహిళలపై మొదలైన నిషేధాలు నెమ్మదిగా మొత్తం ఆటల పైనే నిషేధం దిశగా వెళ్తోంది. తాజాగా చదరంగంపై బ్యాన్ విధిస్తున్నట్టు తాళిబన్లు ప్రకటించారు. ఇది తాత్కాలికమైన నిషేధం అని చెప్తున్నప్పటికీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు.
ఇదే తొలిసారి కాదు
చదరంగం (Chess) ఆడడంపై నిషేధం విధించడం తాలిబాన్లకు ఇది కొత్త కాదు. అమెరికా దాడులకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో చదరంగం ఆడడంపై నిషేధం విధించారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలిక నిషేధం అంటున్నారు. కానీ దానికి ఒక టైమ్ లిమిట్ అంటూ చెప్పకపోవడంతో ఈ నిషేధం శాశ్వతమే అని అర్థమవుతుంది అంటున్నారు చెస్ ప్రేమికులు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టగానే ఆ దేశ జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులు సభ్యులు దేశం విడిచి వెళ్లిపోయారు. అటు ఇటుగా అధికారికంగా ఆ దేశంలో జాతీయస్థాయిలో చదరంగం ఆడే ప్రొఫెషనల్ ప్లేయర్లు 400-500 మంది ఉంటారని ఒక అంచనా. ఇప్పుడు వారంతా ఆటకు దూరమయ్యారు. చదరంగం ఆడితే తాలిబన్ల చేతల్లో కఠిన శిక్షలు ఉంటాయనే భయం వారిని పట్టి పీడిస్తోంది.
చదరంగం అంటే తాలిబన్లకు ఎందుకు అంత కోపం
చదరంగం ఆడితే దైవ ప్రార్థనల పైన ఆసక్తి పోతుంది అనేది మత చాందస తాలిబన్ల ఉద్దేశ్యం అని విశ్లేషణ ఉంది. కానీ పురుషులాడే ఇతర ఆటలకు అనుమతి ఇచ్చి చదరంగం మీద మాత్రమే ఎందుకు నిషేధం విధిస్తున్నారంటే దానికి మరికొన్ని మతపరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒక విదేశీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చదరంగం ఆడడం 'షరియా ' చట్టానికి వ్యతిరేకం. గ్యాంబ్లింగ్ లాంటి ఆటలను షరియా చట్టం ఒప్పుకోదు కాబట్టి చదరంగాన్ని నిషేధిస్తున్నట్టు తాలిబన్లు చెప్పుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదని అభ్యుదయ వాదులు చెబుతున్నారు.
నాలెడ్జ్, డెవలప్మెంట్, లాజిక్ ఇలాంటి విషయాల్లో పురోగతిని తాలిబన్లు సహించరు. ఇప్పటికీ మధ్యయుగాలనాటి చాందసాన్నే వాళ్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రజల్లో ఆలోచనా శక్తిని పెంచే ఎలాంటి అంశాన్ని కానీ క్రీడను గాని తాలిబన్ పెద్దలు ఒప్పుకోరు. దానిలో భాగంగానే ఆడేవాళ్లలో ఆలోచనా సామర్ధ్యాన్ని పెంచే చదరంగాన్ని వాళ్లు నిషేధించినట్టు పరిస్థితులను గమనిస్తున్న వారు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఆ మత చాందస ప్రభుత్వం ఇంకెన్ని నిషేధాలు తెస్తుందో చూడాలి.
భారత్లో పుట్టిన "చదరంగం "
7వ శతాబ్దం నుంచే భారతదేశంలో చదరంగాన్ని ఆడుతున్నట్టు చరిత్రలో ఉంది. దీనిని 'చతురంగ' పేరుతో అప్పట్లో పిలిచేవారు. మేధస్సుకు పదును పెడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సాగే ఈ ఆట భారత్ నుంచి పర్షియాకు అక్కడ నుంచి అరబ్ దేశాలకు ఆపై యూరప్ కంట్రీలకు పాకింది. చిత్రమేంటంటే మిగిలిన అరబ్ కంట్రీలు చదరంగాన్ని నాలెడ్జ్‌ని పెంచే ఒక ఆటగా ఆదరిస్తుంటే తాలిబన్లు మాత్రం ఈ ఆటను ఒక పాపంలా చూస్తూ నిషేధించడం ఎంతో బాధాకరం అంటున్నారు చెస్ క్రీడాభిమానులు.



















