Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది.
Wrestlers Protest:
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వెల్లడించింది.
ఫిర్యాదు దారుల ఉద్దేశం నెరవేరిందని ధర్మాసనం పేర్కొంది. ఇకపై ఈ కేసులో సెక్షన్ 482 సీఆర్‌పీసీ కింద మరికొన్ని పరిహారాలు కావాలంటే దిల్లీ హైకోర్టును సంప్రదించాలని సూచించింది. అందుకు పిటిషినర్లకు స్వేచ్ఛను కల్పిస్తున్నామని తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
సుప్రీం కోర్టు జోక్యం చేసుకొనేంత వరకు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్ నరేందర్ హుడా కోర్టుకు తెలియజేశారు. అందుకే దర్యాప్తును రిటైర్డ్ జడ్జీ లేదా స్వయంగా పర్యవేక్షించాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఇతర పరిష్కారాల కోసం ఫిర్యాదుదారులకు స్వేచ్ఛను ఇస్తున్నామని తెలిపింది.
'ఈ దశలో ప్రొసీడింగ్స్‌ను మాత్రమే ముగిస్తున్నామని ఫిర్యాదుదారులకు స్పష్టం చేస్తున్నాం. పర్యవేక్షణకు అర్హత లేని కేసుగా మేం భావించడం లేదు. ఏదైనా సమస్య ఎదురైతే మీరు మేజిస్ట్రేట్ లేదా దిల్లీ హై కోర్టును సంప్రదించొచ్చు' అని ధర్మాసనం వివరించింది.
ఏప్రిల్ 29న ఒక మైనర్, మే 3న మరో నలుగురు ఫిర్యాదులను దిల్లీ పోలీసులు రికార్డు చేసినట్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. 164 సీఆర్‌పీసీ సెక్షన్ ప్రకారం మేజిస్ట్రరేట్ ముందే స్టేట్‌మెంట్లను రికార్డు చేశారని, వారిందరికీ భద్రత కల్పించారని నోట్ చేసుకుంది.
మైనర్‌తో పాటు మరో ఆరుగురు ఫిర్యాదుదారులకు ఎలాంటి ముప్పు లేదని దిల్లీ పోలీసుల అసెస్‌మెంట్‌లో తేలిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో ముగ్గురు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారని, ముగ్గురు సాయుధ పోలీసులను వారికి రక్షణగా ఉంచామని వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు. ఈ కేసులో తన క్లైయింటును భాగస్వామిగా చేర్చుకుండానే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.
'దర్యాప్తు బాగా కొనసాగుతోంది. సీనియర్ మహిళా అధికారి, ఆమె టీమ్ దర్యాప్తు చేపట్టారు. అయితే పిటిషనర్లు ప్రతిసారీ ఇది ముందు చేయండి.. అది ముందు చేయండి.. అంటూ పదేపదే కోర్టుకు రావడం సరికాదు' అని తుషార్ మెహతా తెలిపారు. 'ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలనే మేం కోరుకుంటున్నాం' అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇందుకు బదులిచ్చారు.
'ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పుడు టీవీ స్టార్‌గా మారారు. ప్రతి రోజూ ఆయన టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన ఫిర్యాదుదారుల పేర్లు, వారి అఖాడాల పేర్లు బయటకు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయన్ను పోలీసులు విచారించలేదని అంటున్నారు. ఫిర్యాదుదారుల గుర్తింపును బయట పెట్టొద్దని కోర్టు చివరి విచారణలో తెలిపింది. ఆయన మాత్రం పేర్లు చెప్పేస్తున్నారు' అని రెజ్లర్ల తరఫు న్యాయవాది హుడా పేర్కొనగా.... 'ఫిర్యాదు దారులు టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు' అని తుషార్ మెహతా, హరీశ్ సాల్వే కౌంటర్ చేశారు.
ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మైనర్ ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, మిగిలిన ఫిర్యాదు దారులను బట్టి రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.