T20 World Cup 2021: ఇంగ్లాండ్లో యాష్‌కు చోటివ్వనందుకు బుజ్జగించే ప్రయత్నమేమో.. సన్నీ సందేహం!
అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికవ్వడం శుభపరిణామం. అయితే తుది జట్టులో అతడికి చోటు దొరుకుతుందో లేదో చూడాలి. అతడిని తుది జట్టులోకి తీసుకోవడం సందేహమేనని సునిల్ గావస్కర్ అంటున్నాడు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటివ్వడం పట్ల క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సంశయం వ్యక్తం చేశాడు. బహుశా అతడిని సంతృప్తి పరిచేందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేసినట్టు కనిపిస్తోందని కుండబద్దలు కొట్టాడు. అతడిని తుది జట్టులోకి తీసుకోవడం సందేహమేనని అంటున్నాడు.
'అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికవ్వడం శుభపరిణామం. అయితే తుది జట్టులో అతడికి చోటు దొరుకుతుందో లేదో చూడాలి. ఎందుకంటే మొత్తం 15 మందిని ఎంపిక చేశారు. ఇంగ్లాండుకూ అతడిని ఎంపిక చేశారు. కానీ తుది పదకొండు మందిలో అవకాశమే ఇవ్వలేదు కదా' అని సన్నీ అన్నాడు.
'బహుశా యాష్‌ను సంతృప్తి పరిచేందుకే అవకాశం ఇచ్చారేమో! ఇంగ్లాండ్ సిరీసులో అతడికి తుది జట్టులో చోటివ్వని నేపథ్యంలో ఇది బుజ్జగించే ప్రయత్నం కావొచ్చు. అతడు ప్రపంచకప్‌లో ఆడతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే' అని గావస్కర్ పేర్కొన్నాడు. కాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం తెలివైన నిర్ణయమని ఆయన ప్రశంసించాడు.
'అశ్విన్ ఎంపిక కన్నా ఎంఎస్ ధోనీని మెంటార్‌గా తీసుకోవడం పెద్ద వార్త. అతడికి 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనుభవం ఉంది. అతడు శిబిరంలో ఉన్నాడంటే టీమ్‌ఇండియాకు ఎనలేని ప్రయోజనం కలుగుతుంది' అని సన్నీ పేర్కొన్నాడు.
Also Read: IPL 2021: 'అతనో బ్యాటింగ్ రాక్షసుడు!'.. బుమ్రా బౌలింగ్‌ను చితకబాదేస్తాడన్న గంభీర్
రవిచంద్రన్ అశ్విన్‌ను కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేయడం లేదు. చివరిసారిగా అతడు 2017 జులైలో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి మణికట్టు స్పిన్నర్లు ప్రవేశించారు. యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ తమ మాయాజాలంతో టీమ్‌ఇండియా స్థిరపడిపోయారు. దాంతో యాష్ తెల్లబంతి క్రికెట్‌కు దూరమయ్యాడు.
కొన్నాళ్లు టెస్టు జట్టులోనూ యాష్‌కు చోటు దక్కలేదు. అతడికి చోటెందుకు ఇవ్వడం లేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జట్టులో నిలకడగా చోటు సంపాదించిన ఈ సీనియర్ స్పిన్నర్ అద్భుతంగా ఆడాడు. 400+ వికెట్ల ఘనత అందుకున్నాడు. అలాంటిది ఇంగ్లాండ్ టెస్టు సిరీసుకు ఎంపికైనా ఒక్క మ్యాచులోనూ అతడిని ఆడించలేదు. నాలుగు టెస్టుల్లోనూ రిజర్వుబెంచీ పైనే కూర్చోబెట్టారు. ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాకే చోటిచ్చారు. ఈ క్రమంలో ఒక మ్యాచులో నిర్వేదం కూర్చొని కనిపించాడు. అలాంటిది అతడికి టీ20 ప్రపంచకప్‌లో చోటివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.