French Open 2024: అదరగొట్టిన స్టార్ జోడి సాత్విక్- చిరాగ్ శెట్టి, ఇక మిగిలింది ఫైనలే
Satwiksairaj Rankireddy and Chirag Shetty: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి అదరగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
Satwiksairaj Rankireddy and Chirag Shetty storm into French Open final: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్-చిరాగ్ శెట్టి(Chirag Shetty and Rankireddy) జోడి అదరగొట్టింది. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో డబుల్స్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది అదిరే ప్రదర్శనతో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరల్డ్ ఛాంపియన్లకు సాత్విక్-చిరాగ్ జోడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో ప్రపంచ ఛాంపియన్లను సెమీస్‌లో మట్టికరిపించిన భారత జోడి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కంగ్ మిన్‌హైక్, సీయో సుఎంగ్జే జోడిపై సునాయసంగా విజయం సాధించింది. 21-13, 21-16తేడాతో వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వరుసగా మూడోసారి ఫ్రెంట్ ఓపెన్ ఫైనల్‌లో అడుగు పెట్టిన జోడీగా రికార్టు సృష్టించింది. ఫైనల్లో జపాన్, తైవాన్ జోడీల మధ్య జరగనున్న మ్యాచ్ విజేతతో సాత్విక్, చిరాగ్ తలపడనున్నారు.
సింగిల్స్‌లో తప్పని ఓటమి
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. థాయ్‌లాండ్ ప్లేయర్ కున్లవుత్ వితిద్‌సన్న్ చేతిలో కంగుతిన్నాడు. 20-20, 21-13, 21-11తో కునల్‌పుత్ గెలుపొందాడు. ఇప్పటికే పీవీ సింధు కూడా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వెనుదిరిగింది.
నెంబర్ వన్ జోడీ
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్(World no1 badminton ranking) కైవసం చేసుకుని తమకు తిరుగులేదని ఇంకొకసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్ 8వ ర్యాంక్ దక్కించుకోగా లక్ష్యసేన్ 19వ స్థానంలో నిలిచాడు.
ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో....
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. డబుల్స్ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు... మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి... మూడో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.
మలేసియా ఓపెన్ వరల్డ్ టోర్నీలోనూ....
మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి... 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ జోడీ వాంగ్ – లియాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.