Ross Taylor Slapgate: షాకింగ్ రిపోర్ట్స్! రాస్ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?
Ross Taylor Slapgate: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్‌టేలర్ చెంప దెబ్బల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. అతడి చెంపలు వాయించిన ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని ఎవరంటే...!
Ross Taylor Slapgate: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్‌టేలర్ చెంప దెబ్బల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. అతడి చెంపలు వాయించిన ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని ఎవరో తెలుసుకొనేందుకు జనాలు ఆసక్తిగా ఉన్నారు. సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాయే అతడిని కొట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐ సైలెంట్
ఇక బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ ఈ వివాదంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తమకు ఇప్పటి వరకు తెలీదని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ఓ అధికారిని ప్రశ్నించగా 'నేనిప్పుడు ప్రయాణిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు' అని బదులిచ్చారు.
ఈ వ్యవహారంపై బోర్డు మరీ ఎక్కువ కాలం నిశ్శబ్దంగా ఉండే అవకాశం లేదు. త్వరలోనే దర్యాప్తు జరిపిస్తుందని అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సైతం ఏమీ చెప్పడం లేదు. 'ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు' అని ఆ ఫ్రాంచైజీ అధికారి ఒకరు అన్నారు.
శిల్పాశెట్టి భర్తే!
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రానే రాస్‌టేలర్ చెంపలు వాయించాడని సమాచారం. అప్పట్లో జైపుర్ ఐపీఎల్ క్రికెట్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియమ్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ బాధ్యతలు చూసుకొనేది. ఇందులో ఎవరికి ఎంత వాటా ఉండేదో ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. సురేశ్ చెల్లారమ్ కుటుంబానికి చెందిన ట్రెస్కోకు 45 శాతం, లాచ్‌లాన్ మర్డోక్‌కు 11.7 శాతం, ఎమర్జింగ్ మీడియాకు 32.4 శాతం, రాజ్‌కుంద్రాకు 11.7 శాతం వాటాలు ఉండేవని మీడియాలో వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్‌పై నిషేధం వేటు పడేంత వరకు రాజ్‌కుంద్రా జట్టుతోనే ఉన్నాడు. 2015 సీజన్ వరకు జట్టుతోనే ప్రయాణించేవాడు. రాస్ టేలర్ తన ఆత్మకథలో రాసుకున్న ఘటన నాలుగో ఎడిషన్లో చోటు చేసుకుంది. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ పర్యటించిన ప్రతి స్టేడియానికి శిల్పా, కుంద్రా వెళ్లేవారు.
2011-12 సీజన్లో కుంద్రా దంపతులు మినహా మిగతా భాగస్వాములు జట్టుతో ఉండేవారు కాదని అప్పడున్నవాళ్లు చెబుతున్నారు. 'అప్పట్లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తప్ప మిగతా యజమానులు ఎక్కువగా వచ్చేవారు కాదు. మనోజ్ బాదలే అప్పుడప్పుడు వస్తుండేవారు. బహుశా టేలర్ చెబుతున్న యజమాని రాజ్‌కుంద్రాయే కావొచ్చు' అని గతంలో ఆ జట్టుకు పనిచేసిన వారు చెబుతున్నారు.
టేలర్ ఏం చెప్పాడు?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఛేదనలో డకౌట్ అయ్యాక రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తన చెంపలు వాయించారని రాస్ టేలర్ అన్నాడు. అయితే గట్టిగా కొట్టలేదని పేర్కొన్నాడు. 'రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలిలో తలపడ్డాయి. మేం 195 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తున్నాం. నేను ఎల్బీ రూపంలో డకౌట్ అయ్యాను. మేం కనీసం లక్ష్యానికైనా చేరువ కాలేదు' అని అతడు వివరించాడు.
'ఆ తర్వాత జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, యాజమాన్యం ఓ హోటళ్లో టాప్ ఫ్లోర్‌లోని బార్‌కు వెళ్లారు. షేన్ వార్న్‌తో పాటు లిజ్ హర్లీ ఉన్నారు. అప్పుడే రాయల్స్ యజమానుల్లో ఒకరు నా దగ్గరికి వచ్చారు. రాస్.. నువ్వు డకౌట్ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్ డాలర్లు ఇస్తుందని అన్నాడు. నా చెంపలపై మూడు నాలుగు సార్లు కొడుతూ నవ్వాడు' అని టేలర్ పేర్కొన్నాడు.
'అతడు నవ్వుతున్నాడు. పైగా గట్టిగా ఏం కొట్టలేదు. అయితే అతడు ఉద్దేశ పూర్వకంగా కొట్టాడో లేదా సరదాగా చేశాడో నేను చెప్పలేను. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్దది చేయలేదు. అయితే ప్రొఫెషనల్ క్రీడా టోర్నీల్లో అలాంటివి జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు' అని రాస్ టేలర్ పేర్కొన్నాడు.