Asia Team Championships: చైనాకు చెక్ పెట్టిన భారత్ , పునరాగమనంలో సింధు సత్తా
PV Sindhu: మలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
PV Sindhu makes winning return as India beat China: మలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్( Badminton Asia Team Championships)లో పటిష్ఠ చైనా(China)కు భారత్(Bharat) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో టాప్ సీడ్ చైనా జట్టును మట్టికరిపించి టేబుల్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అద్భుత ఆటతీరుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అక్టోబర్ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్ పోరులో హాన్ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
పోరాడిన డబుల్స్ జోడీలు....
ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల అన్మోల్ ఖర్బ్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టును నాకౌట్‌కు తీసుకెళ్లింది. దీంతో మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది. మరోవైపు పురుషుల టీమ్ ఈ టోర్నీలో 4-1తో హాంకాంగ్‌పై గెలిచి నాకౌట్‌లో నిలిచింది.
‘ఫైటర్’ మూవీపై పీవీ సింధు రివ్యూ
తాజాగా ‘ఫైటర్’ సినిమాను చూసినట్లు పీవీ సింధు వెల్లడించింది. . తాజాగా ఈ మూవీపై బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రివ్యూ ఇచ్చింది. తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సినిమా అద్భుతం అంటూ ప్రశంసించింది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటనపైనా పొగడ్తల వర్షం కురిపించింది. సినిమాతో పాటు సినిమాలోని నటీనటుల యాక్టింగ్ ను ఓ రేంజిలో పొగిడేసింది. “వాట్ ఏ మూవీ, హృతిక్, దీపికా ఉఫ్.. అనిల్ సర్, జస్ట్ టైమ్ లెస్” అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. ఈ మేరకు ఫైటర్ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ తన రివ్యూను వెల్లడించింది. పీవీ సింధు రివ్యూపై దీపికా పదుకొణె స్పందించింది. సింధు పోస్టును రీ పోస్ట్ చేస్తూ ‘లవ్ యు’ అని వెల్లడించింది.