Vinesh Phogat Replacement: రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ స్థానంలో ఆమెకు ఛాన్స్, షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు
Guzman Lopez Replaces Vinesh Phogat | వినేశ్ ఫొగాట్ స్థానంలో ఫైనల్లో ఆమెకు ఛాన్స్, షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు
Paris Olympics 2024 Guzman Lopez Replaces Disqualified Vinesh Phogat in Final | పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ కు చివరి నిమిషంలో ఒలింపిక్ కమిటీ షాకిచ్చింది. నిర్ణీత 50 కేజీల కన్నా 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ నుంచి ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో ఆమె ఏ పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. అయితే ఇదే సమయంలో అందరి డౌట్ ఏంటంటే.. వినేష్ ఫొగాట్ స్థానంలో ఫైనల్ ఎవరు ఆడతారని చర్చ జరుగుతోంది. అయితే వినేశ్ ఫొగాట్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్ ఫైనల్ ఆడనుంది.
చిత్తుగా ఓడినా ఫైనల్ బరిలోకి క్యూబా రెజ్లర్
రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగం సెమీఫైనల్లో వినేశ్ ఫొగాట్ చేతిలో ఓటమి చెందిన రెజ్లరే ఈ గుజ్మన్ లోపేజ్. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో వినేష్ ఫొగాట్ 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుని చరిత్ర సృష్టించింది. రెజ్లింగ్ లో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్ గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. కానీ అదనపు బరువు కారణంగా వినేశ్ పై అనర్హత వేటు పడింది. దాంతో సెమీఫైనల్లో వినేశ్ చేతిలో ఓటమి చెందిన క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్ కు ఫైనల్ ఛాన్స్ దక్కింది. ఫైనల్లో వినేశ్ స్థానంలో క్యూబా రెజ్లర్ లోపేజ్ బరిలోకి దిగి.. అమెరికా రెజ్లర్, టోక్యో కాంస్య విజేత సారా హిల్డర్ బ్రాంట్ తో తలపడనుంది.
బుధవారం రాత్రి 11:23 నిమిషాలకు 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ ప్రారంభం కానుంది. మరోవైపు కాంస్య పతకం కోసం ఉక్రెయిన్ కు చెందిన ఒక్సన, జపాన్ రెజ్లర్ సుసాకీ తలపడనున్నారని ఒలింపిక్ నిర్వాహకులు స్పష్టం చేశారు.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) రూల్స్ ప్రకారం రెజ్లర్లు వారు పాల్గొంటున్న కేటగిరీ అంత బరువు మాత్రమే ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువు ఉన్నట్లు గుర్తిస్తే ఆ క్రీడాకారులపై అనర్హత వేటు వేస్తారు. వారికి ఎలాంటి పతకం ఇవ్వరు. వారు పాల్గొన్న కేటగిరీలో ఆ పోటీలో చివరి ర్యాంకును కేటాయిస్తారు. 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై అయిన కారణంగా వినేశ్ ఫొగాట్ ను ఓడిపోయినట్లు ప్రకటించి రజతం ఇవ్వడం లాంటివి చేయరు. ఆర్టికల్ 11 ప్రకారం సెమీఫైనల్లో వినేశ్ ఫొగాట్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ లోపేజ్ ను ఫైనల్ కు ఎంపిక చేస్తారు.
Also Read: శరీరం నుంచి రక్తం తీసి, తిండీనీరు మానేసి, విశ్వక్రీడల కోసం వినేశ్ త్యాగాలు
పోరాటాలే మిగిలాయి, పతకం చేజారింది
వినేశ్ ఫొగాట్ వాస్తవానికి 53 కేజీల విభాగంలో పోటీ పడేవారు. పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సైతం సాధించింది. అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై వినేశ్ పోరాడారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదు. ఈ క్రమంలో ఆమె గాయపడి మంచానికి పరిమితమయ్యారు. కోలుకుని ఒలింపిక్స్ కు సిద్ధం కాగా, మరో రెజ్లర్ 53 కేజీల విభాగంలో చోటు దక్కించుకుంది. దాంతో 55 కేజీలకు మారాలని కొందరు సూచించగా, వినేశ్ ఫొగాల్ 3 కేజీలు తగ్గి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. ప్రపంచంలో అత్యుత్తమ రెజ్లర్లను చిత్తుచేస్తూ ఫైనల్ చేరింది. కానీ యుడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం అదనపు బరువు ఉందన్న కారణంగా స్వర్ణం ఆశలు చేజారాయి. ఒలింపిక్స్ ఫైనల్ చేరినా ఏకంగా పతకం లేకుండా చివరి స్థానంలో నిలిచింది.
Also Read: ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్- వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు- 100 గ్రాములతో వంద కోట్ల మంది ఆశలు గల్లంతు