Why Gujarat Titans lost: అద్భుతంగా ఆడినా, ఆ తప్పిదాలే మా కొంప ముంచాయి .. ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. తమ ఓటమికి కారణాలపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు.

IPL 2025 Eliminator MI vs GT: : ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ నాకౌట్ మ్యాచ్‌లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాజీ ఛాంపియన్ గుజరాత్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రెండో కప్ కొట్టాలన్న గుజరాత్ ఆశలకు ముంబై గండి కొట్టింది. దాదాపు 16 ఓవర్ల వరకు రేసులో ఉన్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చివర్లో గాడి తప్పింది. జట్టు ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం పలు విషయాలు చెప్పాడు. జీటీ ఓటమికి కారణాలపై మాట్లాడుతూ, 3 క్యాచ్‌లు వదిలేయడం వల్ల బౌలర్లకు ఫీల్డింగ్ నుండి ఎలాంటి హెల్ప్ లభించలేదు. దాంతో బౌలర్ల మనోస్థైర్యం దెబ్బతింది. వారు కట్టుదిట్టంగా బంతులేసినా, లైఫ్ దొరికిన బ్యాటర్లు ఈజీగా పరుగులు రాబట్టడం మాకు మైనస్ అయిందని గిల్ తెలిపాడు.
అద్భుతమైన మ్యాచ్, కానీ మంచి ముగింపు కాదు.. శుభ్‌మన్ గిల్
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపై స్పందించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ అద్బుతంగా జరిగింది. మేం మంచి క్రికెట్ ఆడాము. నేటి మ్యాచ్‌లో చివరి 3-4 ఓవర్లు మాకు కలిసిరాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన మ్యాచ్. ఆరంభం నుంచి బాగానే ఆడి పరుగులు రాబట్టాం. కానీ ఫీల్డింగ్ లో 3 క్యాచ్‌లు వదిలేయడం బౌలర్ల లయను దెబ్బతీసింది. దాంతో ముంబై బ్యాటర్లను జీటీ బౌలర్లు నియంత్రించలేకపోయారు.
ఛేజింగ్ చేయడానికి క్రీజులోకి దిగినప్పుడు స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలనుకున్నాం. అదే మా ముందున్న ఏకైక విషయం. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌కు ఇదే చెప్పాం. ఆ ఇద్దరు ఆటగాళ్లు కూడా మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం అన్నట్లు ఆడారు. సుందర్ విలువైన పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ ఔట్ కావడం మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఆ తరువాత వేగంగా పరుగులు చేయకపోవడంతో లక్ష్యానికి దూరమయ్యాం. సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో గుజరాత్‌కు అద్భుతంగా ఆడి విజయాలు అందించాడు. ఈ పిచ్‌లో 210 పరుగుల టార్గెట్ వరకు ఛేజ్ చేయవచ్చు. కానీ ఫీల్డింగ్ లో చేసిన పొరపాట్లే మ్యాచ్ ను దూరం చేశాయని’ గిల్ అన్నాడు.
క్వాలిఫైయర్-2లో ముంబై
గుజరాత్‌పై నెగ్గిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్-2కు ఎంటరైంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, క్వాలిఫయర్ 1లో ఓటమి చెందిన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబై, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గే జట్టు జూన్ 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
పంజాబ్ లోని ముల్లన్ పూర్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫిఫ్టీ (50 బంతుల్లో 81, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన గుజరాత్ 6 వికెట్లకు 208 పరుగులకే పరిమితమై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ సెంచరీ (49 బంతుల్లో 80, 10 ఫోర్లు, 1 సిక్సర్లు)తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ సైతం (24 బంతుల్లో 48 పరుగులు) జట్టును గెలిపించేందుకు విఫల ప్రయత్నం చేశారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 2 వికెట్లు దక్కాయి. గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగే క్వాలిఫయర్ 2లో పంజాబ్ తో ముంబై తలపడుతుంది.





















