Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన యువ ఆటగాడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే తనకు సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. 15 బంతుల్లో మూడు ఫోర్లతో తను 22 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్లను తను భయం లేకుండా ఎదుర్కొన్న విధానం అందరినీ ఆకట్టుకుంది.
అసలు ఎవరీ తిలక్ వర్మ?
తిలక్ వర్మ (19) ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. దీంతో తిలక్ క్రికెట్ కోచింగ్‌కు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో కోచ్ సలాం బయాష్... తిలక్ క్రికెట్ కోచింగ్‌కు అవసరమైనవన్నీ సమకూర్చారు. హైదరాబాద్ తరఫున మూడు ఫార్మాట్లలో తిలక్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 381 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండగా... స్ట్రైక్ రేట్ 140కి పైగా ఉండటం విశేషం.
ఐపీఎల్‌లో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌తో పోటీ పడి ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను దక్కించుకోవడం విశేషం. తిలక్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా... దానికి 8.5 రెట్లు అధిక మొత్తం తనకు లభించింది.
ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ, టైమల్ మిల్స్, డేనియల్ శామ్స్, టిమ్ డేవిడ్, మురుగన్ అశ్విన్ మొదటి మ్యాచ్ ఆడారు. బొటనవేలి గాయం నుంచి ఇంకా కోలుకోనందున సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.
View this post on Instagram