IPL 2024:కింగ్ కోహ్లీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, విరాట్ రికార్డుల హోరు
Virat kohli : మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండు సీజన్లలో 700కుపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.
Virat Kohli Has Set New Record In History Of Ipl: ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆరంభంలో ఏడు మ్యాచుల్లో వరుసగా అయిదు పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన వేళ... బెంగళూరు అద్భుతమే చేసింది. ఆరు వరుస విజయాలతో ప్లే ఆఫ్ చేరి అబ్బురపరిచింది. బెంగళూరు చేసిన ఈ ప్రయాణంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ కీలకంగా మారింది ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడిన కోహ్లీ.. తన జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో కీలకమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చెన్నైతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో విరాట్ 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి భారీ స్కోరుకు గట్టి పునాది వేశాడు. ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ దగ్గరే ఆరెంజ్ క్యాప్ ఉంది.
కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు
మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండు సీజన్లలో 700కుపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ మాత్రమే 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. గేల్, కోహ్లీ ఇద్దరు బెంగళూరుకే ప్రాతినిథ్యం వహించడం విశేషం. గేల్ మైదానంలో చూస్తుండగానే కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ ఈ సీజన్‌లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్‌రేట్ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ ఇదే. ప్రస్తుత సీజన్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్‌లో కోహ్లీ 974 పరుగులు చేశాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్‌ను విరాట్ 37 సిక్స్‌లతో ముగించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ కోహ్లీనే. తర్వాతి స్థానంలో 36 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్‌లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. భారత్ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే. చెన్నైపై ఇన్నింగ్స్‌తో 9000 పరుగులు చేశాడు. తర్వాత రోహిత్ 8,008 పరుగులు చేశాడు.
అద్భుతం సాకారం
ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించింది. వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించి అద్భుతం చేసింది. వరుస విజయాలతో బెంగళూరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. తప్పక ఘన విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైను మట్టికరిపించి ప్లే ఆఫ్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఏడు వికెట్లకు 191 పరుగులే చేసింది. 200 పరుగులు చేస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న దశలో చెన్నై కేవలం 191 పరుగులకే పరిమితమైంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ తలా అభిమానులకు నిర్వేదాన్ని మిగులుస్తూ ఈ మెగా టోర్నీ నుంచి చెన్నై రిక్త హస్తాలతో వెనుదిరిగింది.