SRH IPL 2022: ఇవేం వ్యూహాలు ఇదేం జట్టు - నేనుండనంటూ SRH కోచ్ రాజీనామా!
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహాయ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. IPL 2022 వేలం విషయంలో ఆయన అసంతృప్తి చెందారని తెలిసింది.
SRH assistant coach Simon Katich tenders resignation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలవ్వక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్! ఆ జట్టు సహాయ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ముందే నిర్ణయించుకున్న వ్యూహాలను వేలంలో అమలు చేయకపోవడంతో ఆయన అసంతృప్తి చెందారని తెలిసింది. కొందరు ఆటగాళ్లకు అనవసరంగా కోట్లు కుమ్మరించారని, అనుకున్న వాళ్లను తీసుకోకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ సహాయ బృందానికి టామ్ మూడీ నాయకుడిగా ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా, హేమంగ్ బదానీ, ముత్తయ్య మురళీధరన్ ఈ బృందంలో ఉన్నారు. గతేడాది పనిచేసిన ట్రెవర్ బేలిస్‌ను ఈసారి తీసుకోలేదు. వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరు ఎన్‌సీయే అధినేతగా వెళ్లిపోయాడు.
సైమన్ కటిచ్ ఎందుకు రాజీనామా చేశాడో సన్‌రైజర్స్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించలేదు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారో, దానికి అంగీకరించారో యజమాని కావ్య మారన్ మీడియాకు చెప్పలేదు.
వేలంలో సన్‌రైజర్స్ వ్యూహాలు ఎవరికీ అర్థం కాలేదు. కీలక ఆటగాళ్లను తీసుకోలేదు. స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేయలేదు. ఎక్కువగా వెస్టిండీస్ ప్లేయర్లను తీసుకున్నారు. మళ్లీ పాతవారికే ఎక్కువ డబ్బు చెల్లించారు. మిడిలార్డర్‌లో ఒత్తిడిలో ఆడగల ఫినిషర్లు ఎవరూ కనిపించడం లేదు.
వేలంలో పంజాబ్ కింగ్స్ తర్వాత ఎక్కువ డబ్బుంది సన్‌రైజర్స్ వద్దే. రూ.68 కోట్లతో రంగంలోకి దూకింది. అలాంటప్పుడు ఇద్దరో, ముగ్గురో స్టార్లను ఎక్కువ డబ్బుతో కొనుచ్చు కదా! అదీ చేయలేదు. ఏ మాత్రం నిలకడలేని, బలహీనతలు ఉన్న నికోలస్ పూరన్‌కు రూ.10.75 కోట్లు చెల్లిస్తోంది. రొమారియో షెపర్డ్‌కు రూ.7.75 కోట్లు ఎందుకు పోసిందో తెలియదు. కొన్న ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగీ, అయిడెన్ మార్‌క్రమ్, మార్కో జన్‌సెన్ కాస్త బెటర్ అనిపిస్తోంది. పూరన్ ఎప్పుడెలా ఆడతాడో తెలియదు. మిగతా వాళ్లను నమ్మలేం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎప్పట్లాగే మళ్లీ ఒకే బలహీనతను ప్రదర్శించింది. ఎక్కువ మంది బౌలర్లపై ఇన్వెస్ట్ చేసింది. సరైన బ్యాటింగ్ ఆర్డర్‌ను పట్టించుకోలేదు. క్రికెట్ ఒక బృంద క్రీడ. అలాంటప్పుడు అన్ని విభాగాలు బలంగానే ఉండాలి. ఉదాహరణకు కెప్టెన్ కేఎన్ విలియమ్సన్ ఇప్పుడు మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతడు అందుబాటులో లేకుంటే జట్టును నడిపించేదెవరో తెలియదు. విదేశీయులను కోట్లు పెట్టి కొన్నా జట్టులో ఆడేది చివరికి నలుగురే. అలాంటప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో సమన్వయం, జట్టు కూర్పు కుదరడం కష్టం.