IPL 2026: IPLలో ఇకపై ఈ ఆటగాళ్లు కనిపించకపోవచ్చు! కొందరు రిటైర్మెంట్ కావచ్చు!
IPL 2026: ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? ఇలాంటి అనుమానాలు చాలా మంది క్రికెటర్లపై ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి కొందరు రిటైర్మెంట్ తీసుకుంటే మరికొందరు అమ్ముడుపోకుండా ఉండిపోవచ్చు.

IPL 2026:IPL సీజన్ 18 ముగిసింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి టైటిల్ గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ మరోసారి రన్నరప్‌గా నిలిచింది. 2 నెలలకుపైగా జరిగిన ఈ ఈవెంట్ ప్రజలను బాగా అలరించింది, ఇందులో దేశ విదేశాలకు చెందిన వందల మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంష్ ఆర్య, ఆయుష్ మహత్రే వంటి వారు తమ ఆటతీరుతో తాము IPL భవిష్యత్తు అని నిరూపించారు. అయితే, వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో కనిపించని ఆటగాళ్ల జాబితా కూడా పెద్దగానే ఉంది.
అలాంటి క్రికెటర్ల గురించి మాట్లాడితే, మొదట MS ధోని పేరు వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ధోని IPL 2025 ముగిసిన తర్వాత తాను ఆడాలా లేదా అని ఆలోచిస్తానని చెప్పాడు. ధోని IPL 2026లో ఆడకపోవచ్చు, అంతకు ముందే రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కానీ అతనితోపాటు, IPL తదుపరి సీజన్‌లో ఆడటం కష్టంగా ఉన్న చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రికెటర్లు స్వయంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు, మరికొందరు ఆటగాళ్ళు వేలంలో అమ్ముడుపోకుండా ఉండవచ్చు.
ఆర్ అశ్విన్
చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన ఆర్ అశ్విన్ కూడా వచ్చే ఏడాది ఆడటం కష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది క్రికెట్ మూడు ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకున్న అశ్విన్‌ను CSK 9.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సెప్టెంబర్‌లో అశ్విన్ 39 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు, వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే అతను రిటైర్మెంట్ తీసుకోవచ్చు.
మొయిన్ అలీ
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మొయిన్‌ను కోల్‌కతా అతని బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతను కేవలం 2 ఇన్నింగ్స్‌లు ఆడాడు, అందులో 5 పరుగులు చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే, అతను 5 ఇన్నింగ్స్‌లలో 16 ఓవర్లు వేసి 6 వికెట్లు తీశాడు. KKR అతన్ని వదిలించుకోవచ్చు. మరే ఇతర జట్టు అతన్ని కొనుగోలు చేయడం కష్టం.
గ్లెన్ మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన ఫిట్‌నెస్‌ను కారణంగా చూపిస్తూ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు, కానీ అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గాయం కారణంగా అతను టోర్నమెంట్ మధ్యలో వెళ్లిపోయాడు. మాక్స్‌వెల్‌ను పంజాబ్ పొరపాటున కొనుగోలు చేసిందని చాలా మంది చెప్పారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో మాక్స్‌వెల్ ఫామ్‌లో ఉన్నాడు కానీ IPLలో కొన్ని ఇన్నింగ్స్‌లను మినహాయిస్తే, అతను ఎక్కువగా ఫ్లాప్ అవుతుననాడు. అటువంటి పరిస్థితిలో, అతను వచ్చే ఏడాది ఆడటం కష్టం, ఒకవేళ పంజాబ్ అతన్ని విడుదల చేస్తే, మరే ఇతర జట్టు అతన్ని కొనుగోలు చేయడం కష్టం. ఈ సంవత్సరం డేవిడ్ వార్నర్‌ను కూడా ఏ జట్టు కొనలేదు, ఆ తర్వాత అతను PSL ఆడటానికి వెళ్ళవలసి వచ్చింది.
ఫాఫ్ డుప్లెసిస్
ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్ అక్షర్ పటేల్ గాయపడిన తర్వాత జట్టు పగ్గాలు చేపట్టాడు. 40 ఏళ్ల ఫాఫ్ ఈ సీజన్‌లో బాగా ఆడలేదు. అతను 9 ఇన్నింగ్స్‌లలో 123 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. ఫాఫ్ స్వయంగా లీగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు.




















