RR Vs PBKS: చివరి బంతి వరకూ పోరాడిన రాజస్తాన్ - థ్రిల్లర్‌లో పంజాబ్ విక్టరీ!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
Rajasthan Royals vs Punjab Kings: ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షిమ్రన్ హిట్‌మేయర్ (36: 18 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ధ్రువ్ జోరెల్ (32 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ (86 నాటౌట్: 56 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. రవిచంద్రన్ అశ్విన్‌ను (0: 4 బంతుల్లో) ఓపెనర్‌గా పంపి చేసిన ప్రయోగం ఫలించలేదు. అశ్విన్ నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవకుండా అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్ (11: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (19: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత సంజు శామ్సన్ (42: 25 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), దేవ్‌దత్ పడిక్కల్ (21: 26 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. సంజు వేగంగానే ఆడినా దేవ్‌దత్ పడిక్కల్ మరీ నిదానంగా ఆడటంతో చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. 91 పరుగుల వద్ద సంజు శామ్సన్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రియాన్ పరాగ్ (20: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ కూడా అవుటయ్యారు. దీంతో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఓటమి అంచున నిలిచింది.
ఈ దశలో షిమ్రన్ హెట్‌మేయర్ (36: 18 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), కొత్త కుర్రాడు ధ్రువ్ జోరెల్ (32 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను పరిగెత్తించారు. వీరు కేవలం 27 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో షిమ్రన్ హెట్‌మేయర్ అవుట్ కావడంతో మ్యాచ్ రాజస్తాన్ చేతికి వచ్చింది. హెట్‌మేయర్ స్థానంలో వచ్చిన హోల్డర్ (1 నాటౌట్: 1 బంతి) క్రీజులోకి వచ్చీరాగానే భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితం అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), శిఖర్ ధావన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 9.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. అనంతరం ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి జేసన్ హోల్డర్ రాజస్తాన్‌కు మొదటి వికెట్ అందించాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన భానుక రాజపక్స (1: 1 బంతి) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ (27: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. జితేష్ శర్మ అవుటయ్యాక శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.