KKR vs PBKS Match Highlights: చరిత్ర చూడని ఛేజింగ్- కోల్‌కతా ఫ్యూజులు పీకేసిన పంజాబ్- ఈ మ్యాచ్‌లో తవ్వేకొద్ది రికార్డులే రికార్డులు
IPL 2024: ఈ మ్యాచ్‌లో మొత్తం 42 సిక్సులు పడ్డాయి. ఒక్క పంజాబే 24 సిక్సులు బాదింది. పోరాడితే పోయేదేముంది అన్నట్లు పంజాబ్ కింగ్స్ విరుచుకపడ్డారు.
KKR vs PBKS : టీ20ల్లో 180 ఛేజింగ్ చేశారంటే అర్థం ఉంది. 200 కొడితే అద్భుతం అనొచ్చు. 250 కొడితే మహాద్భుతం అనాలి. మరి 262పరుగులను ఛేజ్ చేసేస్తే ఏమన్నాలి. అది ఈ సీజన్‌లో ఎవడు దొరికితే వాడికి ఇచ్చి పడేస్తున్న కోల్‌కతా(KKR)కు ఫ్యూజులు ఎగిరిపోయేలా పంజాబ్(PBKS) లాంటి చిన్న టీమ్ షాకిస్తే ఆ కిక్కే వేరు కదా. ఎస్ మొన్న టేబుల్‌లో అట్టడుగున ఉన్న ఆర్సీబీ(RCB) ..సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)కి షాక్ ఇస్తే నిన్న ఆర్సీబీకి కొంచెం పైనున్న పంజాబ్ హైదరాబాద్ కంటే పైనున్న కోల్‌కతా దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా చేసింది. యథావిధిగా నరైన్ సాల్ట్ ఉతికి ఆరేయటంతో మొదటి వికెట్‌కే 138పరుగులు పెట్టిన కోల్‌కతా.. వాళ్లిద్దరూ అవుటైనా టీమ్ స్కోరును తలో చేయి వేసి 261పరుగులకు తీసుకువెళ్లింది.
పంజాబ్ టీమ్‌లో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా లక్ కలిసిరాని ఈ సీజన్‌లో అది చాలా ఎక్కువ వాళ్లకు అనుకుంటే...పోరాడితే పోయేదేముంది అన్నట్లు కింగ్స్ విరుచుకపడ్డారు. ఈ సీజన్‌లో బ్యాట్ పట్టుకోవటమే రాదన్నట్లు ఆడిన బెయిర్ స్టో..ఈడెన్ గార్డెన్స్‌లో దుమ్ము లేపటంతో లక్ష్యం దిశగా సాగిన పంజాబ్‌కు...ఈ సీజన్‌లో పంజాబ్ తరపున సూపర్ స్టార్ శశాంక్ సింగ్ మరోసారి అదిరిపోయే నాక్ ఆడాడు.
బెయిర్ స్టో 48 బాల్స్ లో 9 సిక్సులతో సూపర్ సెంచరీ కొడితే...శశాంక్ సింగ్ 28 బాల్స్‌లోనే 8 సిక్సులతో 68 పరుగులు బాదేసి టీ20 చరిత్రలోనే అతిపెద్ద ఛేజింగ్‌ను పంజాబ్ పేరు మీద రాశాడు. మొత్తంగా ఈ విక్టరీతో పంజాబ్ క్వాలిఫైయర్స్ ఆశలను బతికించుకోగా అంత టార్గెట్ ఇచ్చినా కాపాడుకోలేని కోల్‌కతా ఏం చేయలేక చేతులు కట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
232 బాల్స్‌లో 523పరుగులు వచ్చాయి. ఆ ఇన్నింగ్స్‌లో 42 సిక్సులు ఉన్నాయి. వినటానికి ఎంత భారీగా ఉందో కదా. ఎస్ దీన్ని నిజం చేసి చూపించింది కోల్‌కతా, పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్. దాదాపుగా అన్ని రికార్డులను సరికొత్తగా తిరగరాసింది ఈ మ్యాచ్. ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నరైన్, సాల్ట్ పవర్ ఫుల్ హిట్టింగ్ 261 పరుగులు చేస్తే ఛేజింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే 262పరుగుల లక్ష్యాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్.
ఈ మ్యాచ్‌లో మొత్తం 42 సిక్సులు పడ్డాయి. ఒక్క పంజాబే 24 సిక్సులు బాదింది. మొన్ననే SRH పెట్టిన ఇన్నింగ్స్‌లో 22 సిక్సుల రికార్డును బ్రేక్ చేసింది పంజాబ్. పంజాబ్‌లో రబాడా, కోల్‌కతాలో నరైన్ తప్ప రెండు టీమ్స్‌లో మిగిలిన బౌలర్లంతా 10 ఎకానమీపైనే పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌లో శామ్ కరన్, కోల్‌కతాలో హర్షిత్ రానా 4ఓవర్లలో 60కిపైగా పరుగులు సమర్పించుకున్నారు.
బౌలర్లను పూర్తిగా మింగేసేలా సాగిన ఈ గేమ్ టీ20 విధ్వంసాల్లో అతిపెద్దదిగా అనేక రికార్డులను పేరు మీద రాసుకుంది. అతి పెద్ద టీ20 ఛేజింగ్‌గా మొదటి స్థానంలోనూ, ఇరుజట్లు కలిపి చేసిన పరుగుల జాబితాలో 523పరుగులతో మూడోస్థానంలోనూ నిలిచింది.