PBKS Vs RR: రెండు ఓవర్లలో 46 పరుగులు - చివర్లో చితక్కొట్టిన పంజాబ్ - రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయానికి 188 పరుగులు కావాలి.
Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 66వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్‌లో విజయం అవసరమే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ తరఫున శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేష్ శర్మ (44: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), షారుక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా మంచి ఆటతీరు కనపరిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టాడు.
చివర్లో రెండు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 46 పరుగులు రాబట్టింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 28 పరుగులు, ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 18 పరుగులను శామ్ కరన్, షారుక్ ఖాన్ రాబట్టారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్‌రేట్‌ను రాజస్తాన్ రాయల్స్ దాటాలంటే 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. రాజస్తాన్ దానికి తగ్గట్లుగా ఆడాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అంత సాఫీగా ప్రారంభం కాలేదు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2: 2 బంతుల్లో), శిఖర్ ధావన్ (17: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), వన్ డౌన్ బ్యాటర్ అథర్వ తైదే (19: 12 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), టూ డౌన్‌లో వచ్చిన లియాం లివింగ్‌స్టోన్ (9: 13 బంతుల్లో, ఒక ఫోర్) అందరూ విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అనంతరం శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), జితేష్ శర్మ (44: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరు ఐదు వికెట్‌కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆ తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో జితేష్ శర్మ అవుటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న శామ్ కరన్‌కు షారుక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) జతకలిశాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. పంజాబ్ తరఫున ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, ఆడం జంపాలు తలో వికెట్ పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, రిషి ధావన్, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ సేన్, మురుగన్ అశ్విన్.