IPL2024: టాస్ నెగ్గిన లఖ్‌నవూ, ఏం ఎంచుకుందంటే
LSG vs DC : ఎకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ -ఢిల్లీ ల మధ్య జరగున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన లఖ్‌నవూ బ్యాటింగ్ ఎంచుకుంది.
LSG vs DC IPL2024 Lucknow Super Giants opt to bat: ఈ ఐపీఎల్(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG).. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్... లక్నో బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన లక్నో..ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో లక్నోపై ఇప్పటివరకూ గెలవని ఢిల్లీ... ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను అడ్డుకోవాలంటే... ఢిల్లీ బౌలర్లు తమ స్థాయికి మించి రాణించాల్సి ఉంది.
డికాక్ మెరుస్తాడా
లక్నో బ్యాటింగ్‌లో క్వింటన్ డి కాక్, KL రాహుల్‌లతో బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. డికాక్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోవడంతో కెప్టెన్ రాహుల్ ఇంకా సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఆ లోటు తీర్చుకోవాలని రాహుల్ పట్టుదలగా ఉన్నాడు. నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరిలో బ్యాటింగ్‌కు వస్తున్న పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. కానీ దేవదత్ పడిక్కల్ ఫామ్ లక్నోను ఆందోళన పరుస్తోంది. 150కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు సంధిస్తూ లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న లక్నో స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో లక్నో పేసర్ యష్ ఠాకూర్... గుజరాత్‌పై అయిదు వికెట్లు తీసి సత్తా చాటాడు. యష్ ఠాకూర్ సహా నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్ చాలా బలంగా ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 2023 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో కైల్ మేయర్స్ 38 బంతుల్లో 73 పరుగులు చేయడంతో 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఢిల్లీని కేవలం 143 పరుగులకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్
లక్నోలోని ఎకానా స్టేడియం బ్యాటర్.. బౌలర్లకు సమానంగా అనుకూలిస్తోంది. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత 199 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో లక్నోను గుజరాత్ టైటాన్స్ 163 పరుగులకే పరిమితం చేసింది. దీనిని బట్టి పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు. నెమ్మదిగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు ఉపకరిస్తుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు విజయం సాధించింది. రెండుసార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 159. అత్యధిక స్కోరు 199/8. అత్యల్ప జట్టు మొత్తం 108.