KKR Vs CSK: కోల్‌కతాపై చెన్నై భారీ విక్టరీ - ఒకేసారి టేబుల్ టాప్‌కు కూడా!
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగులతో ఘనవిజయం సాధించింది.
Kolkata Knight Riders vs Chennai Super Kings: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది.
కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ (61: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ (53 నాటౌట్: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కానీ వారికి మిగతా టీమ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే... విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే (71 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే 245 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. శివం దూబే (50: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు), డెవాన్ కాన్వే (56: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టడం విశేషం.
ఆరంభంలోనే ఎదురుదెబ్బలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరే సరికే ఓపెనర్లు సునీల్ నరైన్, ఎన్ జగదీషన్ పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. కానీ వేగంగా ఆడలేకపోయారు. రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించిన అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
జేసన్ రాయ్ ఎంట్రీతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. రాయ్ మొదటి బంతి నుంచి చిచ్చరపిడుగులా చెలరేగాడు. అయితే రాయ్ వచ్చిన కాసేపటికే నితీష్ రాణా అవుటయ్యాడు. కానీ జేసన్ రాయ్, రింకూ సింగ్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. కోల్‌కతా అభిమానులకు మ్యాచ్‌లో ఏ దశలోనైనా గెలుపుపై ఆశలు ఉన్నాయా అంటే అది వీరు క్రీజులో ఉన్నప్పుడే.
ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జేసన్ రాయ్ అవుటయ్యాక కోల్‌కతా ఓటమి ఖరారైంది. తర్వాత వచ్చిన వారిలో ఎవరూ క్రీజులో నిలబడలేదు. చివరి వరకు క్రీజులో ఉన్న రింకూ సింగ్ ఒంటరి పోరాటం సరిపోలేదు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీష్ థీక్షణలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆకాష్ సింగ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, పతిరాణాలు తలో వికెట్ పడగొట్టారు.
మొదటి బంతి నుంచే వీరంగం
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చెన్నైకి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి బంతి నుంచే బౌండరీలతో చెలరేగారు. వీరి బ్యాటింగ్‌తో చెన్నై పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు సాధించింది. అయితే సుయాష్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరు మొదటి వికెట్‌కు 73 పరుగులు జోడించారు.
రెండో వికెట్‌కు రహానేతో కలిసి 36 పరుగులు జోడించిన అనంతరం డెవాన్ కాన్వే కూడా అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి చెన్నై బ్యాటింగ్ టాప్ గేర్‌కు వెళ్లిపోయింది. అజింక్య రహానే, శివం దూబే ఇద్దరూ శివాలెత్తిపోయినట్లు ఆడారు. వీరు మూడో వికెట్‌కు కేవలం 32 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆ తర్వాత శివం దూబే అవుటైనా రవీంద్ర జడేజా కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.