IPL 2025 Postponed For 1 Week : ఐపీఎల్ కు వారం రోజుల బ్రేక్.. ఆ తర్వాత లీగ్ నిర్వహణపై ఆలోచన.. లీగ్ చైర్మన్ ధుమాల్ ప్రకటన
జోరుగా సాగుతున్న ఐపీఎల్ కు చిన్న బ్రేక్.. ఉద్రిక్త పరిస్థితుల రిత్యా వారం పాటు బ్రేక్ వేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. టోర్నీని ఎప్పుడు మళ్లీ స్టార్ట్ చేయాలనేదానిపై అప్ డేట్ ఇచ్చింది.

IPL Chairman Arun Dhumal Comments: 18 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఎప్పుడూ ఇలా టోర్నీ మధ్యలో ఐపీఎల్ వాయిదా పడలేదు. అదీ కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా. ఇక ఐపీఎల్ వాయిదా గురించి లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతానికి ఇరుజట్లు మ్యాచ్ కు ముందున్న పాయింట్లతోనే ఉన్నాయి. మ్యాచ్ రద్దయితే సాధారణంగా చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే ఇరుజట్లకు మాత్రం పాయింట్ల కేటాయింపు జరుగలేదు. ఇక ఐపీఎల్ గురిచి లీగ్ చైర్మన్ గా ధుమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Dharamshala, Himachal Pradesh | On the suspension of IPL 2025, IPL Chairman Arun Dhumal says, "...The tournament has been suspended for a week...The next decision will be taken after assessing the situation"
— ANI (@ANI) May 9, 2025
On the PBKS-DC IPL match in Dharamsala abandoned yesterday,… pic.twitter.com/OrbQbeOwSD
వారం తర్వాత..
ప్రస్తుతానికి పరిస్థితులను సమీక్షిస్తున్నామని, వారం రోజుల తర్వాత లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ధుమాల్ తెలిపారు. మరోవైపు ఐపీఎల్ లో లీగ్ దశ దాదాపు ముగింపునకు వచ్చేసింది. పంజాబ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ 58వది కాగా, మరో 12 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే టోర్నీ ప్లే ఆఫ్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించాయి. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ - ఆర్సీబీ మధ్య లక్నోలోని ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఈరోజు నుంచి నిలిపివేత అమల్లోకి రానుంది. ప్రస్తుత సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (16), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (16), పంజాబ్ కింగ్స్ (15), ముంబై ఇండియన్స్ (14) ఉన్నాయి.
ఉగ్రదాడి మూలంగా..
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను బలితీసుకున్నాయి. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విశ్వరూపం ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యినట్లు సమాచారం. ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు దిగింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేయడంతో, భారత్ సైతం ధీటుగా సమాధానమిస్తోంది. ఎస్-400 లాంటి అత్యాధునిక ఆయుధాల సాయంతో భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే అంతు చూశాయి. అలాగే పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో దాడులు చేశాయి.




















