KL Rahul In IPL: ఆట కంటే ఓనర్ల ప్రశ్నలతోనే టెన్షన్.. ఐపీఎల్ లో కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు
కేఎల్ రాహుల్ IPL కెప్టెన్సీ గురించి మాట్లాడారు. IPL కెప్టెన్సీ అంతర్జాతీయ క్రికెట్ కంటే ఎక్కువ అలసిపోయేదిగా భావిస్తున్నారాయన.

IPL 2026: భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తొలిసారిగా IPLలో కెప్టెన్సీ చేయడం ఎంత కష్టమో స్పందించాడు. రాహుల్ చాలా సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా చేశాడు. ఈ సమయంలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి అభిమానులకు ఇప్పటివరకు తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, IPLలో కెప్టెన్సీ చేయడం అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ అవ్వడం కంటే చాలా కష్టమని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే దేశ ఆటగాళ్లు ఉంటారు. కానీ ఐపీఎల్ టీమ్ విషయానికి వస్తే ఏడాదికి జట్టులో ఆటగాళ్లు మారుతుంటారు, వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో సరిగ్గా చెప్పలేం. రాహుల్ మాటలు నిజమేనని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
IPLలో కెప్టెన్ బాధ్యత ఏమిటి?
హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. IPL కెప్టెన్సీ కేవలం మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం కాదన్నాడు. దీనితో పాటు కెప్టెన్ జట్టు నిర్వహణ, డేటా విశ్లేషణ, నెట్ సెషన్లు, మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత లెక్కలేనన్ని మీటింగ్స్, ప్లాన్స్ ఉంటాయి. వీటన్నింటి నివేదికలను జట్టు యజమానులకు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని బాధ్యతల మధ్య తాను బ్యాటింగ్ లో ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు కొన్నిసార్లు చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ కంటే ఎక్కువ అలసట
IPLలో కెప్టెన్సీ చేస్తున్నప్పుడు మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. కేవలం 2 నెలల IPL ముగిసే సమయానికి అంతర్జాతీయ క్రికెట్ ఏడాది సీజన్ కంటే ఎక్కువ అలసిపోయానని రాహుల్ తెలిపాడు. నిరంతరం మీటింగ్స్, జట్టును బ్యాలెన్స్, చేయడం, ఆటగాళ్ల ఫామ్ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదన్నాడు. మ్యాచ్ ఓడిపోగానే రాహుల్ ను మీడియా, అభిమానులు చూస్తుండగానే గోయెంకా నోరు పారేసుకున్న ఘటనలు వైరల్ కావడం తెలిసిందే.
జట్టు యజమానుల ‘తెలియని ప్రశ్నలు’ పెద్ద సవాలు
IPL జట్టు యజమానుల కొన్ని ప్రశ్నలు కెప్టెన్, కోచ్ లపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయని రాహుల్ వెల్లడించాడు. క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని జట్టు యజమానులు కొన్నిసార్లు అర్థం లేని ప్రశ్నలు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉదాహరణకు,
“ఆ ఆటగాడు ప్లేయింగ్ లెవన్ లో ఎందుకు ఉన్నాడు?”
“ప్రత్యర్థి జట్టు 200 పరుగులు ఎలా చేసింది, మనం 120 పరుగులు ఎందుకు చేయలేకపోయాం?”
“అవతలి టీం బౌలర్లు మనకంటే బాగా స్పిన్ ఎందుకు చేయగలిగారు?”
కెప్టెన్సీ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారతాయని దాంతో మ్యాచ్ మీద ఫోకస్ కంటే ఐపీఎల్ టీం ఓనర్ల ప్రశ్నలను ఎదుర్కోవడం మరింత కష్టం అవుతుందని రాహుల్ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీ వదిలేసి రిలాక్స్ అయిపోయిన రాహుల్
KL రాహుల్ 2022 నుండి 2024 వరకు వరుసగా మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే 2025 నుంచి కెప్టెన్సీ బాధ్యతను వదిలేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సాధారణ ఆటగాడిగా రాహుల్ ఆడుతున్నాడు. కెప్టెన్సీకి దూరమయ్యాక తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నానని, మానసికంగా కూడా తేలికగా అనిపిస్తోందని చెప్పాడు. తీవ్ర ఒత్తిడి కలిగించి లక్నో జట్టును వదిలేశాక రాహుల్ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు.





















