IPL 2025 Final: RCB విజయంపై భారీ బెట్టింగ్స్, 6.5 కోట్లు పందెం కాసిన ర్యాపర్- అంత కాన్ఫిడెన్స్ ఏంటి బ్రో !
Betting on RCB in IPL Final | నేడు జరగబోయే ఫైనల్లో కచ్చితంగా ఆర్సీబీ జట్టు విజయం సాధించి తొలి ఐపీఎల్ కప్పు సొంతం చేసుకుంటుందని ఏకంగా 6.5 కోట్ల మేర బెట్టింగ్ వేయడం హాట్ టాపిక్ అవుతోంది.

RCB vs PBKS IPL 2025 Final: IPL 2025 టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) నేడు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేం్దర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్, ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా, కొత్త విజేత అవతరించనుంది.
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్ చేరినప్పటి నుంచి 'ఈ సాలా కప్ నమదే' (ఈ ఏడాది కప్ మనదే) అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిజానికి కెనడియన్ రాపర్, గ్రామీ అవార్డు విజేత అయిన డ్రేక్ RCBకి వీరాభిమాని. ఆర్సీబీ జట్టు విజయం సాధిస్తుందని దీమాగా ఉన్నాడు. ఎంతలా అంటే.. ఐపీఎల్ ఫైనల్లో RCB గెలుస్తుందని లక్షలాది డాలర్ల పందెం వేశాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తెలియజేశాడు. ర్యాపర్ డ్రేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్క్రీన్‌షాట్ షేర్ చేశాడు. అందులో RCB ఐపీఎల్ ఫైనల్ గెలుస్తుందని 750,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 6,41,08,974 రూపాయలు) పందెం వేశానని తెలిపాడు. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ గెలిస్తే అతడికి ఎంత వస్తుంది..
ర్యాపర్ డ్రేక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో RCB పై బెట్టింగ్ వేసినట్లు తెలిపాడు. ఈ సాలా కప్ నమదే అంటూ సుమారు $750,000 డాలర్లు పందెం వేసినట్లు వెల్లడించాడు, ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ స్టేక్‌లో బెట్టింగ్ వేశాడు. నేడు జరగనున్న ఫైనల్లో పంజాబ్ కింగ్స్ మీద ఆర్సీబీ కనుక గెలిస్తే.. అతనికి ₹10.94 కోట్లకు పైగా (సుమారు $1.312 మిలియన్లు) వస్తాయని సమాచారం.
3 ఫైనల్స్‌లోనూ ఓటమి
ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి ఫైనల్ చేరింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా విజయం వరించలేదు. మూడు పర్యాయాలు ఆర్సీబీ జట్టు రన్నరప్ గా నిలిచింది. నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి 18 ఏళ్ల తమ ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేర్చుకోవాలని రజత్ పాటిదార్ సేన భావిస్తోంది. లీగ్ స్టేజీలో నెంబర్ 2గా నిలిచి క్వాలిఫయర్ 1 ఆడింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ జట్టునే ఓడించి ఫైనల్ చేరింది. నేడు అదే జట్టుతో మరో మ్యాచ్ కు సిద్దమైంది.
లీగ్ స్టేజీలో ఒకసారి, క్వాలిఫయర్ 1లో మరోసారి పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ జట్టు విజయాలు సాధించడం వారికి కలిసిరానుంది. అయితే ఎంత పెద్ద జట్టు ఉన్నా, కొండంత లక్ష్యం ముందున్నా ఛేదిస్తూ ముందుకు సాగుతున్న పంజాబ్ అంటే ఆర్సీబీలో కంగారు ఉండటం సహజమే. గతంలో మూడు పర్యాయాలు చివరి మెట్టుమీద బోల్తా పడిన జట్టు తొలిసారి కప్ కొట్టాలని ఆ క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు మహిళ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడం సైతం వీరిపై ఒత్తిడి పెంచుతోంది. మహిళల జట్టు లీగ్ మొదలైన కొన్ని సీజన్లకే కప్పు కొట్టింది, 17 ఏళ్ల లోటును ఈ తీర్చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఒకవేళ ఆర్సీబీ కప్పు కొడితే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది.





















