IPL 2024: కురవాల్సింది సిక్సర్ల వర్షం- పారాల్సింది పరుగుల వరద-వాన దేవుడా ఆగిపో అంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్
RCB vs CSK Weather : చెన్నై, బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. అయితే వరుణుడు కూడా తన దృష్టి అంతా అక్కడే పెట్టాడు.
RCB vs CSK Weather : ఐపీఎల్(IPL)లో ఇవాళే మహా సమరం జరగనుంది. ఐపీఎల్‌లో మిగిలి ఉన్న ఏకైక ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్(CSK)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ చేరాలని గంపెడు ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్(CSK)తో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. అందుకే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోల్‌కత్తా నైట్‌రైడర్స్... రాజస్థాన్, హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరాయి. మరో బెర్తు మాత్రమే ఖాళీగా ఉంది. ఈ సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ ఆ బెర్తును దక్కించుకునేందెవరో తేల్చనుంది. క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మ్యాచ్ జరుగుతుందా..?
నేడు బెంగళూరులో చెన్నై, బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. ఇందులో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్ నుంచి మరోసారి దూరమవుతుంది. ఘన విజయం సాధిస్తే ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.
కోహ్లీ ఏం చేస్తాడో..?
ప్రస్తుతం ప్లేఆఫ్‌లకు కేవలం ఒక స్థానం మాత్రమే మిగిలి ఉంది. అధికారికంగా మూడు జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీలో ఉన్నాయి. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో ప్లే ఆఫ్ చేరడం దాదాపు అసాధ్యం. ఇక చెన్నై-బెంగళూరు మధ్యే పోరు జరగనుంది. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.528గా ఉంది. అదే ఆర్సీబీ విషయానికి వస్తే.. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.387గా ఉంది. ఈ డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఏం చేస్తాయన్నది కీలకంగా మారింది. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అభిమానులకు మాత్రం ఇది పూర్తి వినోదాన్నిపంచనుంది.