SRH Middle Order: 'రైజ్' అవ్వని మిడిలార్డర్ - ఈ సీజన్లో ఘోరమైన స్ట్రైక్‌రేట్ హైదరాబాద్‌దే!
SRH Middle Order: ఇక ఈ సీజన్లో వెయ్యి పరుగులు చేసిన జట్లలో అత్యంత పేలవమైన మిడిలార్డర్ సన్‌రైజర్స్ హైదరాబాదే! 3-7 స్థానంలోని ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్ ఘోరంగా ఉంది.
SRH Middle Order, IPL 2023:
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చూస్తుంటే జాలేస్తోంది! ఎంత మంచి క్రికెటర్లను తీసుకున్నా ఓటములు తప్పడం లేదు. ఆటగాళ్లలో సత్తా తగ్గిందో.. కోచింగ్ స్టాఫ్ వద్ద వ్యూహాల్లేవో..! మొత్తానికి అభిమానులను వరుసగా మూడో సీజన్లోనూ నిరాశపరిచింది! అందుకు మిడిలార్డరే ప్రధాన కారణం. ఈ సీజన్లో వెయ్యి పరుగులు చేసిన జట్లలో ఘోరమైన స్ట్రైక్‌రేట్ వీళ్లదే! మంచి టార్గెట్లు ఇవ్వడంలో.. వాటిని ఛేదించడంలో కంప్లీట్‌గా విఫలమయ్యారు!
అప్పట్లో..!
జస్ట్.. నాలుగేళ్లు వెనక్కి వెళ్లండి! సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎంత ప్రామిసింగ్‌గా ఉండేదో అర్థమవుతుంది! డేవిడ్ వార్నర్ నాయకత్వంలో తిరుగులేని జట్టుగా అవతరించింది. 2016లో ట్రోఫీ ముద్దాడింది. ఆ తర్వాతి రెండు సీజన్లలో ప్లేఆఫ్ చేరుకుంది. ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అలాంటిది 2019 నుంచి దురదృష్టం వెంటాడుతోంది.. మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లిపోవడం.. వార్నర్‌తో గొడవలు జరగడంతో సన్‌రైజర్స్ విశ్వాసం కోల్పోయింది. మెగా ఐపీఎల్ వేలంలో (IPL 2022) ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో వీరి వ్యూహాలు చూసి అభిమానులు విమర్శలు గుప్పించారు. స్టార్ ప్లేయర్లు.. టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఇతరులు కొనుగోలు చేసేంత వరకు ఆగారు. ఆ తర్వాత కుర్రాళ్లను కొనుకున్నారు.
కసి లేని మిడిలార్డర్!
ఏ టీమ్ అయినా! కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఒక్క సీజన్లోనే వారు మెరుస్తారన్న గ్యారంటీ ఉండదు. అందుకే సీనియర్, జూనియర్.. విదేశీ.. స్వదేశీ ఆటగాళ్ల కూర్పుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ సీజన్ వేలంలో సన్‌రైజర్స్ అందుకోసమే శ్రమించింది. చాలామందిని వదిలిపెట్టేసింది. మొత్తంగా కొత్త జట్టును తీసుకొంది. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి వంటి భారతీయుల్ని ఎంచుకుంది. అయితే ఇండియన్ కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది. ఎక్కువగా విదేశీ ఆటగాళ్లనే కొనుక్కుంది. మిడిలార్డర్లో మొత్తంగా వాళ్లే ఉన్నారు. దాంతో ఇక్కడి పిచ్‌లపై వారు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 20 కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్న హ్యారీ బ్రూక్ కొంప ముంచేశాడు.
ఇదీ ప్రదర్శన!
ఇక ఈ సీజన్లో వెయ్యి పరుగులు చేసిన జట్లలో అత్యంత పేలవమైన మిడిలార్డర్ సన్‌రైజర్స్ హైదరాబాదే! 3-7 స్థానంలోని ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్ ఘోరంగా ఉంది. మొత్తం 10 మంది మిడిలార్డర్లో ఆడారు. 11 మ్యాచుల్లో 772 బంతులు ఎదుర్కొని 134.45 స్ట్రైక్‌రేట్‌తో 1039 పరుగులు చేశారు. సగటు 25.31. ఒక్కరైనా సెంచరీ కొట్టలేదు. హ్యారీబ్రూక్ ఓపెనర్‌గా సాధించాడన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. మూడంటే మూడే హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 80 బౌండరీలు, 49 సిక్సర్లు కొట్టారు.
Also Read: టైటాన్స్‌పై గెలిస్తేనే 'సన్‌రైజర్స్'కు మరో ఉదయం! లేదంటే...!
ముంబయి టాప్!
ఈ కేటగిరీలో ముంబయి ఇండియన్స్ టాప్‌లో నిలిచింది. 12 మ్యాచుల్లో 36.45 సగటు, 162.72 స్ట్రైక్‌రేట్‌తో 1458 రన్స్ కొట్టింది. ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు, 128 బౌండరీలు, 77 సిక్సర్లు ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ 13 మ్యాచుల్లో 28.64 సగటు, 148.75 స్ట్రైక్‌రేట్‌తో 1547 రన్స్ సాధించారు. ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు, 121 బౌండరీలు, 89 సిక్సర్లు వారి ఖాతాలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 147, గుజరాత్ టైటాన్స్ 143, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ 141, రాజస్థాన్ రాయల్స్ 140 స్ట్రైక్‌రేట్‌తో సన్‌రైజర్స్ కన్నా ముందున్నాయి.
Skipper Markram on the way ahead 🗣️ pic.twitter.com/f8S0FNNchS
— SunRisers Hyderabad (@SunRisers) May 14, 2023